ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే షాపుకు వెళ్లే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ కామర్స్ సంస్థల ఎంట్రీతో కొనుగోలు విధానంలో ఊహించని మార్పులు వచ్చాయి. జస్ట్ ఇంట్లో కూర్చోని కావాల్సిన వస్తువును ఆర్డర్ పెట్టుకుంటే చాలు నిమిషాల్లోనే మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎప్పుడంటే అప్పుడు ఆర్డర్ పెట్టుకునే సౌకర్యం ఉంది. దీంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తో పాటు ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీలకు ఆదరణ పెరిగింది. దాదాపు ప్రతి ఒక్కరు ఈ యాప్ లను వినియోగిస్తున్నారు. అయితే కస్టమర్లకు మెరుగైన సేవలను అందించేందుకు కొత్త రూల్స్ ను తీసుకొస్తున్నాయి ఆన్ లైన్ సంస్థలు. వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సేవలను మరింత సులభతరం చేస్తున్నాయి.
సాధారణంగా ఆన్ లైన్ లో బట్టలు, షూస్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు సైజులు సెట్ కాకపోతే ఇబ్బంది పడుతుంటారు. అప్పుడు ఎక్స్ఛేంజ్ పెట్టుకోవడమో లేదా రిటర్న్ చేయడం చేస్తుంటారు. అయితే దీనికి కాస్త ఎక్కువ టైమ్ పడుతుంది. దీంతో కస్టమర్లు ఇబ్బంది పడుతుంటారు. ఈ కారణంతో కస్టమర్లు ఆన్ లైన్ లో కాకుండా నేరుగా షాపులకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి వారిని ఆకర్షించేందుకు ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ కస్టమర్ల కోసం కొత్త సర్వీసులను తీసుకొచ్చింది. ఫుడ్ డెలివెరీ కంపెనీ జోమాటో ఆధ్వర్యంలోని బ్లింకిట్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్ఛేంజ్ అండ్ రిటర్న్ ఫీచర్‌ను ప్రారంభించింది.
ఈ కొత్త సేవల కింద, ఇప్పుడు మీరు ఏదైనా వస్తువును రిటర్న్ చేయాలన్నా లేదా ఎక్స్ఛేంజ్ చేసుకోవాలన్నా ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన పని లేదు. ప్రస్తుతం 10 నిమిషాల్లోనే ఆర్డర్ డెలివెరీ చేస్తున్న బ్లింకిట్, ఎక్స్ఛేంజ్ అండ్ రిటర్న్ పనిని కూడా కేవలం 10 నిమిషాల్లో పూర్తి చేస్తోంది. ప్రస్తుతం, దిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ముంబై,
హైదరాబాద్, బెంగళూరు, పుణెలో ఈ సేవలను బ్లింకిట్ అందిస్తోంది. ఆన్ లైన్ లో బట్టలు, చెప్పులు, బూట్లు కొనుగోలు చేశాక ఫిట్టింగ్ విషయంలో ఇబ్బంది పడుతుంటారు.
వాటి సైజ్, అమరిక సరిగ్గా ఉండకపోవచ్చు. లేదా ఒక్కోసారి నచ్చకపోవచ్చు. దీంతో తమ ఆర్డర్ ను రిటర్న్ చేయాలనుకుంటారు. ఇలాంటి వారికోసమే తాము కేవలం 10 నిమిషాల్లో రిటర్న్ అండ్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధిండ్సా తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ ఫెసిలిటీతో కస్టమర్లు ఇకపై 10 నిమిషాల్లోనే రిటర్న్ అండ్ ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.