Australia vs India Result, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. సూపర్-8 పోరులో భాగంగా సోమవారం (జూన్ 24)న జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాను భారత్ 24 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (92) దంచికొట్టాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎప్పటిలాగానే ఓపెనర్ ట్రావిస్ హెడ్ (74) చెలరేగాడు. అయితే భారత బౌలర్లు విజృంభించడంతో ఆఖరిలో వరుసగా వికెట్లో కోల్పోయింది ఆసీస్. దీంతో విజయానికి 25 పరుగుల దూరంలో నిలిచిపోయింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్, బుమ్రా ఒక వికెట్ తీశారు. ఈ విజయంలో టీమిండియా సెమీస్ బెర్తు ఖరారైంది. మరోవైపు ఈ ఓటమితో ఆసీస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై ఆసీస్ సెమీస్ అవకాశాలు ఆధార పడి ఉన్నాయి.
ఎన్ని పరాజయాలు.. ఎన్ని ఎదురుదెబ్బలు.. ఎన్ని గుండెకోతలు.. ఎంత వేదన!
2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్.. 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ తుది పోరు.. నిరుడు వన్డే ప్రపంచకప్ అంతిమ సమరం.. ఇంకా ఎన్నెన్నో ఐసీసీ టోర్నమెంట్లలో మన ఆశల్ని తుంచేసి కంగారూలు వికటాట్టహాసం చేస్తుంటే.. మనోళ్లు విషణ్ణ వదనాలతో కనిపించిన దృశ్యాలెన్నో! కానీ ఇప్పుడు కంగారూల అవకాశాలను దెబ్బ కొడుతూ.. రోహిత్ సేన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు దూసుకెళ్తుంటే ఎంత సంతృప్తో! కప్పు గెలుస్తామో లేదో తర్వాత ముందు మనోళ్లు ఆస్ట్రేలియాకు చెక్ పెట్టాలన్న అభిమానుల కోరిక తీరింది.
సూపర్-8 మ్యాచ్‌లో బ్యాటుతో, బంతితో ఆధిపత్యం చలాయించిన టీమ్‌ఇండియా.. కంగారూ జట్టును 24 పరుగుల తేడాతో ఓడించి సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఇక ఆస్ట్రేలియా భవితవ్యం అఫ్గానిస్థాన్-బంగ్లాదేశ్ ఫలితం మీదే ఆధారపడి ఉంది.
టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు ఎదురు లేదు. జైత్రయాత్రను కొనసాగిస్తూ, ఆస్ట్రేలియాతో సూపర్-8 చివరి మ్యాచ్‌లోనూ నెగ్గిన రోహిత్‌సేన.. అజేయంగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. సోమవారం మొదట ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ (92; 41 బంతుల్లో 7×4, 8×6) సంచలన ఇన్నింగ్స్‌కు సూర్యకుమార్ (31; 16 బంతుల్లో 3×4, 2×6), శివమ్ దూబె (28; 22 బంతుల్లో 2×4, 1×6), హార్దిక్ పాండ్య (27 నాటౌట్; 17 బంతుల్లో 1×4, 2×6) మెరుపులు తోడవడంతో భారత్ 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం కుల్‌దీప్ యాదవ్ (2/24), అర్ష్‌దీప్ (3/37)ల ధాటికి ఆసీస్ 7 వికెట్లకు 181 పరుగులే చేసింది. ట్రావిస్ హెడ్ (76; 43 బంతుల్లో 9×4, 4×6) మరోసారి భారత్ పాలిట యముడయ్యేలా కనిపించినా.. చివరికి అతను ఓటమి వైపే నిలిచాడు. మిచెల్ మార్ష్ (37; 28 బంతుల్లో 3×4, 2×6) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గురువారం సెమీస్‌లో భారత్.. ఇంగ్లాండ్‌ను ఢీకొంటుంది.
భయపెట్టిన ఆ ఇద్దరు..: ఓ మోస్తరు స్కోర్లే నమోదవుతున్న ప్రపంచకప్‌లో ఆసీస్‌కు 206 పరుగుల లక్ష్యం నిర్దేశించేసరికి భారత్ సునాయాసంగా గెలిచేస్తుందనే అనిపించింది. కానీ చావోరేవో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అంత తేలిగ్గా లొంగలేదు. గత మ్యాచ్‌లో అఫ్గాన్‌పై 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డ ఆ జట్టు.. భారత్‌పై మాత్రం ఛేదనలో గట్టిగానే ప్రయత్నించింది. వార్నర్ (6)ను అర్ష్‌దీప్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఔట్ చేసినా.. హెడ్‌కు జతకలిసిన కెప్టెన్ మిచెల్ మార్ష్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న మార్ష్.. అలవోకగా భారీ షాట్లు ఆడాడు. మరో ఎండ్‌లో హెడ్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. పవర్‌ప్లేలో 65/1తో ఆసీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే ఇతర బౌలర్లు ధారాళంగా పరుగులిస్తున్న సమయంలో స్పిన్నర్ కుల్‌దీప్ పొదుపుగా బౌలింగ్ చేసి ఆసీస్ బ్యాటర్లకు కళ్లెం వేశాడు. స్కోరు వేగం తగ్గడంతో వారిపై ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలోనే బౌండరీ వద్ద అక్షర్ పటేల్ పట్టిన అద్భుత క్యాచ్‌కు మార్ష్ వెనుదిరగాల్సి వచ్చింది. కానీ ఓ ఎండ్‌లో హెడ్ మాత్రం విధ్వంసాన్ని కొనసాగించాడు. మ్యాక్స్‌వెల్ (20) వస్తూనే విధ్వంసానికి దిగడంతో మళ్లీ మ్యాచ్ చేజారుతున్నట్లే కనిపించింది. 11 ఓవర్లకే ఆసీస్ స్కోరు 116 పరుగులకు చేరుకుంది. ఈ స్థితిలో కుల్‌దీప్.. మ్యాక్సీని బౌల్డ్ చేసి భారత్‌కు ఉపశమనాన్ని అందించాడు. ఆ వెంటనే స్టాయినిస్ (2) కూడా వెనుదిరిగాడు. పరుగుల వేగం కూడా తగ్గడంతో సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది. 22 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన స్థితిలో హెడ్‌ను బుమ్రా ఔట్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. అర్ష్‌దీప్ 18వ ఓవర్లో వేడ్ (1), డేవిడ్ (15)లను ఔట్ చేసి ఆసీస్‌కు దారులు మూసేశాడు.
రఫాడించిన రోహిత్: మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ ఇన్నింగ్స్ ఆరంభించిన తీరు చూస్తే.. ఓ మోస్తరు స్కోరైనా చేస్తుందా అనిపించింది. 2 ఓవర్లలో భారత్ కోహ్లి (0) వికెట్ కోల్పోవడమే కాదు, కేవలం 6 పరుగులే చేసింది. హేజిల్‌వుడ్ బంతికి తన శైలికి విరుద్ధంగా అడ్డంగా షాట్ ఆడిన కోహ్లి.. డేవిడ్ చేతికి దొరికిపోయాడు. సూపర్-8 నుంచి కాస్త లయ అందుకున్న విరాట్.. ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌లో తన స్థాయి ఇన్నింగ్స్ ఆడతాడనుకుంటే డకౌటై వెనుదిరగడంతో భారత్‌కు ఇబ్బందులు తప్పవనిపించింది. కానీ కోహ్లి వికెట్ పడ్డ సందర్భంలో తప్ప ఇన్నింగ్స్ మొత్తంలో భారత్ ఏ దశలోనూ వెనుకంజలో లేదు. ఆస్ట్రేలియాను ఆత్మరక్షణలోకి నెడుతూ కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోవడమే అందుక్కారణం. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో 28 పరుగులు (వైడ్‌తో కలిపి 29) రాబట్టిన రోహిత్ ఇన్నింగ్స్‌కు రాకెట్ వేగాన్నందించాడు. ఈ దెబ్బతో మిగతా బౌలర్ల ఆత్మవిశ్వాసం కూడా దెబ్బ తింది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ హ్యాట్రిక్‌లు నమోదు చేసిన కమిన్స్ 4 ఓవర్లలో వికెట్ లేకుండా 48 పరుగులు సమర్పించుకుంటే.. జంపా సైతం వికెట్ లేకుండా 41 పరుగులు ఇచ్చుకున్నాడు. స్టాయినిస్ 2 వికెట్లు తీసినా 56 పరుగుల సమర్పణ తప్పలేదు. స్టార్క్‌తో పాటు వీళ్లందరి గణాంకాలు దెబ్బ తినడంలో రోహిత్‌దే కీలక పాత్ర. కెప్టెన్ జోరుతో 9వ ఓవర్లోనే భారత్ 100 దాటేసింది. ఫామ్‌లో ఉన్న పంత్ (15) విఫలమైనా.. సూర్యకుమార్ అండతో రోహిత్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించడంతో 11 ఓవర్లకు 127/2తో భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది. అప్పటికే రోహిత్ 90ల్లోకి వచ్చేశాడు. అతడి శతకం లాంఛనమే అనుకుంటుండగా.. స్టార్క్ చెక్ పెట్టాడు. ఆ తర్వాత స్కోరు వేగం కొంచెం తగ్గినా.. ఆస్ట్రేలియా పైచేయి మాత్రం సాధించలేదు. సూర్యతో పాటు దూబె, హార్దిక్ సమయోచితంగా రాణించి స్కోరును 200 దాటించారు.
4165
టీ20ల్లో రోహిత్ పరుగులు. అత్యధిక పరుగుల జాబితాలో అతడిదే అగ్రస్థానం. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ (4145)ను రోహిత్ అధిగమించాడు.
8
ఈ మ్యాచ్‌లో రోహిత్ కొట్టిన సిక్సర్లు. టీ20 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా యువరాజ్ సింగ్ (2007లో 7) రికార్డును తిరగరాశాడు. అంతర్జాతీయ టీ20ల్లో 200 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడు రోహితే (203). గప్తిల్ (173) రెండో స్థానంలో ఉన్నాడు.
52
రోహిత్ అర్ధశతకం అందుకున్నప్పుడు జట్టు పరుగులు. ఓ ఆటగాడు అర్ధసెంచరీ చేసిన సమయంలో ఓ జట్టు చేసిన అత్యల్ప పరుగులు ఇవే.
19
అర్ధశతకానికి రోహిత్ ఆడిన బంతులు. టీ20ల్లో ఇదే అతని వేగవంతమైన అర్ధశతకం. టీ20ల్లో ఆస్ట్రేలియాపై అత్యంత వేగంగా అర్ధశతకం చేసిన ఆటగాడిగా యువరాజ్, పోలార్డ్ (20)లను వెనక్కినెట్టాడు. ఈ టోర్నీలో వేగవంతమైన యాభై ఇదే.
92
ఈ మ్యాచ్‌లో రోహిత్ స్కోరు. టీ20 ప్రపంచకప్‌ల్లో భారత్ తరఫున రైనా (2010లో దక్షిణాఫ్రికాపై ఇదే మైదానంలో 101) తర్వాత అత్యధిక స్కోరు అతనిదే. గేల్ (2010లో భారత్‌పై 98) తర్వాత అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ రోహితే.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) స్టార్క్ 92; కోహ్లి (సి) డేవిడ్ (బి) హేజిల్‌వుడ్ 0; పంత్ (సి) హేజిల్‌వుడ్ (బి) స్టాయినిస్ 15; సూర్యకుమార్ (సి) వేడ్ (బి) స్టార్క్ 31; దూబె (సి) వార్నర్ (బి) స్టాయినిస్ 28; హార్దిక్ నాటౌట్ 27; జడేజా నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205; వికెట్ల పతనం: 1-6, 2-93, 3-127, 4-159, 5-194; బౌలింగ్: స్టార్క్ 4-0-45-2; హేజిల్‌వుడ్ 4-0-14-1; కమిన్స్ 4-0-48-0; జంపా 4-0-41-0; స్టాయినిస్ 4-0-56-2
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) సూర్యకుమార్ (బి) అర్ష్‌దీప్ 6; హెడ్ (సి) రోహిత్ (బి) బుమ్రా 76; మార్ష్ (సి) అక్షర్ పటేల్ (బి) కుల్‌దీప్ 37; మ్యాక్స్‌వెల్ (బి) కుల్‌దీప్ 20; స్టాయినిస్ (సి) హార్దిక్ (బి) అక్షర్ 2; టిమ్ డేవిడ్ (సి) బుమ్రా (బి) అర్ష్‌దీప్ 15; వేడ్ (సి) కుల్‌దీప్ (బి) అర్ష్‌దీప్ 1; కమిన్స్ నాటౌట్ 11; స్టార్క్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 181; వికెట్ల పతనం: 1-6, 2-87, 3-128, 4-135, 5-150, 6-153, 7-166; బౌలింగ్: అర్ష్‌దీప్ సింగ్ 4-0-37-3; బుమ్రా 4-0-29-1; అక్షర్ పటేల్ 3-0-21-1; హార్దిక్ 4-0-47-0; కుల్‌దీప్ 4-0-24-2; జడేజా 1-0-17-0