ఆస్తిలో నాన్న వాటానే కాదు.. అన్న కోటా కూడా ఇచ్చాడు. తండ్రి నుంచి షర్మిలకు వచ్చిందెంత? ఆమెకు జగన్ సొంతంగా ఇచ్చిందెంత?
YS Property Fight: అన్నా-చెల్లెలు.. మధ్యలో అమ్మ.. అర్థాంతమా..? రాజకీయమా..?
ఘర్ ఘర్ కా కహానీ. ఇంటింటి రామాయణం. చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ ‘నా’అన్నవాళ్లతోనే. ఈ డైలాగులన్నీ గుర్తొస్తాయి వైఎస్ జగన్-షర్మిల ఆస్తి తగాదా గురించి విన్న తరువాత..! మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఓ మాట ముమ్మాటికీ వాస్తవం. ‘మీ ఇళ్లల్లో ఇలాంటి కుటుంబ గొడవలు లేవా’ అని ప్రశ్నించారు. నిజమే.. ప్రతి గడపలో ఉండే ఇంటిపోరే ఇది. కాకపోతే, రాజకీయ నేపథ్యం.. సమాజంలో వైఎస్ జగన్‌కు, వైఎస్ ఫ్యామిలీకి ఉన్న స్టేటస్ కారణంగా అదో బ్రేకింగ్ న్యూస్ అయింది. ఈ ఇష్యూని ఓ న్యూస్‌లా చూస్తే ఫర్వాలేదు గాని.. ‘చూశారా.. వైఎస్ జగన్ తన తల్లి, చెల్లి మీదే కేసు వేశారట’ అని సమాజంలో ఓ టాపిక్‌గా మారింది.
‘రాజకీయం అంటే అదే గురూ’ అనే వాళ్లు ఎలాగూ ఉంటారు. కాని, వాస్తవం అనేది ఒకటి ఉంటుందిగా. మరి.. జగన్-షర్మిల-విజయమ్మ మధ్య జరిగిన ఈ ఆస్తి గొడవలో వాస్తవాలేంటి? వైఎస్ జగన్ ఏమో.. తాను స్వార్జితంతో సంపాదించిన ఆస్తిలోంచి.. చెల్లెలిపై ప్రేమానురాగాలతో ఇస్తున్నానని చెబుతున్నారు. షర్మిలనేమో.. అది జగన్ కష్టార్జితం కాదు.. కుటుంబ సంపద ద్వారా, కుటుంబ వనరుల ద్వారా ఆర్జించిన ఆస్తి కాబట్టి అందులో తనకూ వాటా ఉంటుందని అంటున్నారు.
ఆస్తిలో ఆడపిల్లకు సమాన వాటా ఇవ్వొద్దా..? ఇదీ మొదటి ప్రశ్న. ఎందుకు ఇవ్వకూడదు. కచ్చితంగా ఇచ్చి తీరాలి. చట్టం అదే చెబుతోంది కదా..! ఇదీ ఆ ప్రశ్నకు సమాధానం. వైఎస్ షర్మిల అడుగుతున్నది కూడా ఇదే అనేది ఓ వర్గం వాళ్లు చెబుతున్న మాట. ఓ వర్గం అని ఎందుకు అనాలి. స్వయంగా షర్మిలనే చెప్పారుగా వైఎస్ జగన్‌కు రాసిన లేఖలో. ఏమన్నారు వైఎస్ షర్మిల..!. ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితకాలంలో కుటుంబ వనరులతో సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా పంచాలని ఆయన నిర్ద్వంద్వంగా ఆదేశించారు’ అని వైఎస్ జగన్‌కు షర్మిల రాసిన లేఖలో చాలా క్లియర్‌గా చెప్పారు.
ఇంకాస్త విపులంగా చెప్పుకోవాలంటే.. ‘భారతి సిమెంట్స్‌లో గానీ, ఆ కుటుంబానికి చెందిన మీడియా సంస్థలో గాని, లేదా.. మరేదైనా వ్యాపారం, లేదా వెంచర్‌లో గానీ వైఎస్ జగన్ పిల్లలకు ఎంత వాటా వస్తుందో అంతే సమాన వాటా షర్మిల పిల్లలకు కూడా వస్తుంది’ అనేది వైఎస్ షర్మిల లేఖ సారాంశం. షర్మిల చెబుతున్న ఆస్తులు, వెంచర్లకు అర్థం ఏంటో కూడా చెప్పుకోవాలిక్కడ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి ముందు ఉన్న ఆస్తి లేదా వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడు ప్రారంభించిన వెంచర్లు, ప్రాజెక్టులకే ‘ఆస్తి’ అని అర్ధం. పంచుకోవాల్సింది కూడా వీటినే.
సో, వీటన్నింటిలోనూ సమాన వాటా ఉంటుందనేది షర్మిల చేస్తున్న వాదన. కాని.. ఇక్కడో ‘కండీషన్స్ అప్లై’ అనే చుక్కను కూడా గమనించాలి. తండ్రి సంపాదించిన ఆస్తిలో, లేదా వారసత్వంగా వస్తున్న ఆస్తిలో ఆడపిల్లకు సమాన వాటా ఉంటుందన్నది నిజం. మరి.. ఎవరి ఆస్తులు వాళ్లు పంచేసుకున్న తరువాత కూడా మళ్లీ వాటా ఇవ్వడం ఉంటుందా? ఎవరి ఆస్తుల్ని వాళ్లు సొంతంగా సంపాదించుకుంటున్నప్పుడు.. మళ్లీ ఆడపిల్లకు ఆస్తి వాటా పంచి ఇవ్వాలా? ఇదీ వైఎస్ జగన్ వర్షన్. వారసత్వంగా వచ్చిన ఆస్తులను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే జగన్‌కు, షర్మిలకు పంచి పెట్టారని ఇప్పటికే స్పష్టం చేశారు జగన్. అలాంటప్పుడు మళ్లీ ఈ ఆస్తి తగాదా ఎక్కడి నుంచి వచ్చింది? సమాన వాటా రావాలని వైఎస్ షర్మిల ఎందుకు అడుగుతున్నారు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వైఎస్ కుటుంబంలోని కీలక వ్యక్తులు చెబుతున్నదేంటంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తులను జగన్, షర్మిల సమానంగా పంచుకున్న తరువాత ఎవరి వ్యాపారాలు, ఎవరి ఆస్తి వ్యవహారాలు వాళ్లు చూసుకుంటున్నారు. ఆ తరువాత వైఎస్ జగన్ ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. షర్మిలపై ఉన్న ప్రేమానురాగాలతో తన కష్టార్జితంలోంచి కూడా కొంత వాటాను చెల్లెలు షర్మిలకు ఇద్దామనేది వైఎస్ జగన్ ప్రతిపాదన. బహుశా.. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి కష్టపడడం కావొచ్చు. లేదా తాను జైలుకు వెళ్లినప్పుడు చెల్లి షర్మిలనే పార్టీని నడిపించారన్న కృతజ్ఞతా భావం కావొచ్చు. లేదా జగన్‌పై వచ్చిన ఒత్తిడి కావొచ్చు. జగన్‌పై ఒత్తిడి ఏంటి? షర్మిలకు వాటా ఇవ్వాలని కుటుంబ సభ్యులెవరైనా జగన్‌కు నచ్చజెప్పి ఉండొచ్చు. కారణం ఏదైనా.. తన కష్టార్జితంలో నుంచి కొంత షర్మిలకు ఇవ్వాలనుకున్నారు. ఇది నిజం. కాకపోతే.. ఎంవోయూలు చేసుకోవాల్సిన అవసరం ఏంటనేదే ప్రశ్న.
ఆస్తి పంపకాలలో వైఎస్ షర్మిలకు ఆ వాటా వెళ్లేలా ఒక ఎంవోయూ జరిగింది. అంటే.. షర్మిలకు ఆస్తిలో వాటా ఇస్తాను అని నమ్మకం కలిగించడం కోసం జరిగిన ఓ ప్రయత్నంలా కనిపిస్తోంది. షర్మిలకు నమ్మకం కలిగించడం కోసం ఎంవోయూలు ఎందుకు జరిగిందనేది ఫ్యామిలీ మ్యాటర్. ఏదేమైనా.. ఈ అంశాన్నే ఎంవోయూ చేసుకున్నారు. అంటే.. ఓ అవగాహన ఒప్పందం అన్నమాట. అది కూడా ఎప్పుడు జరిగిందీ వ్యవహారం అంతా అంటే.. 2019 ఆగస్ట్ 31వ తేదీన. అంటే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్దికాలంలోనే ఈ ఎంవోయూ జరిగింది. ఎంవోయూను అంగీకరిస్తూ ఇరువురు సంతకాలు కూడా చేసుకున్నారు.
ఇంతకీ, వైఎస్ జగన్, షర్మిల మధ్య జరిగిన ఆ అవగాహన ఒప్పందం ఏంటి? రికార్డుల్లో ఉన్న దాని ప్రకారం చెప్పాలంటే.. వైఎస్ జగన్‌కు చెందిన 10 రకాల ఆస్తులను.. షర్మిలకు బదిలీ చేయాలని ఓ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. కోర్టు కేసుల తరువాత షర్మిలకు బదిలీ చేస్తామని ఓ మాట మాట్లాడుకున్నారు. ఇక్కడ అవగాహన ఒప్పందం అంటే అర్ధం ఏంటంటే.. భవిష్యత్తులో ఇచ్చే దానిపై ముందుగా ఓ మాట అనుకోవడం. ‘ఇదిగో ఫలానా ఆస్తి, ఫలానా షేర్లను భవిష్యత్తులో నీకు ఇస్తాను’ అని రాతపూర్వకంగా రాసుకోవడమే అవగాహన ఒప్పందం.
ఇలా ఎందుకు ఎంవోయూ చేసుకోవాల్సి వచ్చిందంటే.. జగన్ తన ఆస్తులన్నింటిలో 40 శాతం వాటాను షర్మిలకు ఇవ్వాలనుకున్నారని ఆయనే స్వయంగా స్పష్టం చేశారు. కాకపోతే.. ఇద్దామనుకున్న ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్నాయి. అలాంటప్పుడు షర్మిలకు ఆస్తులు బదలాయింపు సాధ్యం కాదు కాబట్టి.. షర్మిలకు ఒక నమ్మకం కలిగించడానికి ఎంవోయూ చేసుకున్నారు. వైఎస్ జగన్, షర్మిల మధ్య జరిగిన ఎంవోయూ ఇది.
మరి.. తన కష్టార్జితంలోని ఆస్తిలో కూడా వాటా ఇస్తానన్నప్పుడు.. డైరెక్టుగా రాసిచ్చేయొచ్చుగా. మధ్యలో ఈ అవగాహన ఒప్పందం ఏంటి? భవిష్యత్తులో ఇస్తాననడం దేనికి? ఎందుకంటే.. వైఎస్ జగన్ ఆస్తులకు సంబంధించి కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి. అవన్నీ సర్దుబాటు అయ్యాక.. ఆస్తులు బదిలీ చేస్తామని చెప్పామనేది వైఎస్ జగన్ వర్షన్. అంటే.. ‘కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, అవి క్లియర్ కాగానే ఇచ్చిన మాట ప్రకారం వాటాలు ఇచ్చేస్తాను’ అని షర్మిలకు వైఎస్ జగన్ రాసిచ్చిన ఒక అగ్రిమెంట్.
ఇంతకీ.. 2019 ఆగస్ట్ 31న చేసుకున్న ఆ ఎంవోయూలో ఏముంది? ఆస్తులపై న్యాయపరంగా తుదితీర్పు వచ్చిన తర్వాతే బదలాయింపు ప్రక్రియ చేసుకుందామని ఓ నిర్ణయానికి వచ్చాకనే షర్మిల, వైఎస్ జగన్ ఒప్పందంపై సంతకాలు పెట్టారు. ముందుగా.. చట్టానికి లోబడి ఆర్డర్ డేట్‌కు అనుగుణంగా స్థిరాస్తుల బదలాయింపు ఉంటుందని ఓ ఒప్పందం చేసుకున్నారు. ఒకవేళ తీర్పు గనక వ్యతిరేకంగా వస్తే.. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తీసుకున్న డబ్బు, ఆస్తులు, గిఫ్ట్‌లు, లోన్లు అన్నింటినీ షర్మిలకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలేంటంటే.. భారతి సిమెంట్, జననీ ఇన్‌ఫ్రా, కార్మెల్ హోల్డిండ్స్ మీడియా హౌస్, బంజారాహిల్స్ సాక్షి టవర్.. ఈ మూడు ఆస్తులపై షర్మిలకు హక్కులు వచ్చిన తర్వాత వేరే వాళ్లకు బదలాయింపు చేయకూడదు. ఒకవేళ చేయాలనుకుంటే ముందుగా వైఎస్ జగన్‌కు ఆఫర్ ఇవ్వాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ ఆఫర్ చేసిన ధరను జగన్ ముందుంచాలి. ఆ ఆఫర్‌ను జగన్‌కు తిరస్కరించవచ్చు లేదా సొంతం చేసుకోవచ్చు. జగన్ రాతపూర్వకంగా వద్దని చెప్పిన తర్వాతే షర్మిల వీటిని వేరే వారితో డీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ ఎంవోయూలో కీలక అంశాలు. ఇలా.. ఇరువైపుల వాళ్లు మానసికంగా స్థిరంగా, ఎవరి ప్రోద్భలం లేకుండా, ఒత్తిళ్ల లొంగకుండా, మనఃపూర్వకంగా రాసుకుంటున్న అగ్రిమెంట్ ఇది. ఈ అగ్రిమెంట్ ఈ రోజు నుంచి ఆస్తుల ప్రక్రియ బదలాయింపు వరకూ అమల్లో ఉంటుందని అదే ఒప్పందంలో రాసుకున్నారు.
ఇరువురు ఒప్పందం చేసుకున్నా సరే.. సరస్వతి పవర్ విషయం మాత్రం వివాదంగా మారిందంటారు సన్నిహితులు. అదేంటంటే.. ఈ ఎంవోయూ నాటికి షర్మిలకు ఇద్దామనుకున్న ఆస్తుల్లో సరస్వతి పవర్ అటాచ్‌మెంట్‌లో లేవు. అందుకే, వాటిలో ఓనర్‌షిప్ ఇద్దామనుకున్నారు. కాని, 2021 డిసెంబర్‌లో కోర్టులో ఓ పిటిషన్ పడి ఆస్తులు ఈడీకి అటాచ్ అయ్యాయి. దీంతో.. వైఎస్ జగన్ షర్మిలకు ఇవ్వాల్సిన ఆ వాటాలను షేర్ కాగితాలపై రాసి, సంతకం చేసి, గిఫ్ట్ డీట్ చేసినట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. సరస్వతి పవర్‌లో జగన్‌కు 29.88 శాతం వాటా ఉంది. వైఎస్ భారతి రెడ్డికి 16.30 శాతం వాటా, ఇదే సరస్వతి పవర్‌లో వైఎస్ విజయమ్మకు 1.42 శాతం వాటా ఉంది. సండూర్ పవర్‌లో 18.80 శాతం, క్లాసిక్ రియాల్టీలో 33.60 శాతం వాటా కూడా ఉంది.
సో, వీటిలోంచి వైఎస్ విజయమ్మకు షేర్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. అంటే.. అప్పటి వరకు 1.42 శాతం మాత్రమే వాటా ఉన్న వైఎస్ విజయమ్మకు.. షేర్ల ట్రాన్స్‌ఫర్ తరువాత 48.99 శాతానికి పెరిగింది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే.. సండూర్ పవర్‌లోని మొత్తం వాటాను, క్లాసిక్ రియాల్టీలోని 28.77 శాతం వాటాను 2021 జూన్ 2న విజయమ్మకు బదిలీ చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. వైఎస్ జగన్, షర్మిలకు మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ప్రకారం.. షేర్ల ట్రాన్స్‌ఫర్స్ అంతా వైఎస్ విజయమ్మకు జరిగింది. కాకపోతే.. 2021 జులై 26న జగన్‌కు చెందిన 74లక్షల 26వేల 294 షేర్లను, భారతికి చెందిన 40 లక్షల 50వేల షేర్లను.. గిఫ్ట్ డీడ్ కింద వైఎస్ విజయమ్మకు బహుమతిగా ఇచ్చారు. సో ఆ తరువాత జరిగిన పరిణామాలతో.. వైఎస్ షర్మిల సూచనతో.. జనార్దన్ రెడ్డి చాగారిని సరస్వతి పవర్‌లో డైరెక్టర్‌గా నియమించారు. ఇదీ జరిగిన కథ.
ఇక్కడో ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకు విజయమ్మకే షేర్లు ట్రాన్స్‌ఫర్ చేశారు అని. ఎందుకంటే.. కోర్టు ఆదేశాల ప్రకారం షేర్ల బదలాయింపు కేవలం వాటాదారుల మధ్యే జరగాలి. అందుకే, వాటాదారు అయిన విజయమ్మకు ట్రాన్స్‌ఫర్ చేశారు. పైగా 50 శాతానికి మించి ట్రాన్స్‌ఫర్ అయితే ఓనర్‌షిప్ మారుతంది. అలా జరిగితే లీగల్‌గా ప్రాబ్లమ్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి మిగతా 49 శాతం విజయమ్మకు గిఫ్ట్‌డీడ్ చేశారు. కోర్టు సమస్య రాకుండా మొత్తం షర్మిలకు ఆస్తులు బదలాయించాలన్నదే వైఎస్ జగన్ ఉద్దేశం. జగన్‌కు చిత్తశుద్ధి ఉంది కాబట్టే వంద శాతం షేర్ల బదిలీ అయ్యే ప్రయత్నం చేశారన్నది జగన్ వర్గం వాదన. అంటే.. తన స్వార్జితంలోంచి, తనకు, తన భార్య భారతికి చెందిన వాటాలను షర్మిలకు గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చామనేది వైఎస్ జగన్ చెబుతున్న మాట. ఇక్కడి వరకు ఎలాంటి పంచాయితీ లేదు. ఎవరి మధ్యా తగాదాలు కూడా రాలేదు. మూడేళ్ల పాటు సజావుగానే సాగింది. కాని, 2024 జులై 2వ తేదీన పంచాయితీ మొదలైంది.
కంపెనీ అన్న తరువాత యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటూ జరపాల్సిందే. అందులో భాగంగానే 2024 జులై 2వ తేదీన కంపెనీ జనరల్ మీటింగ్ నిర్వహించారు. కాకపోతే.. కంపెనీ భాగస్వాములుగా ఉన్న వైఎస్ జగన్‌కు గానీ, వైఎస్ భారతికి గానీ, క్లాసిక్ రియాల్టీ కంపెనీకి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదనేది వైఎస్ జగన్ చెబుతున్న మాట. సమాచారం ఇవ్వకపోగా.. అదే జనరల్ మీటింగ్‌లో వైఎస్ జగన్, భారతి షేర్లను వైఎస్ విజయమ్మ పేరిట ట్రాన్స్‌ఫర్ చేశారనే ఆరోపణలు వినిపించాయి. ఈ షేర్ల బదిలీ 2024 జులై 6న అంటే.. జనరల్ బాడీ మీటింగ్ జరిగిన నాలుగు రోజులకు జరిగినట్టు రికార్డుల్లోఉంది. షేర్ల బదిలీ అయితే జరిగింది గానీ.. ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు మాత్రం జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ పేరుతోనే ఉన్నాయి. ఎక్కడా షేర్ ట్రాన్స్‌ఫర్ డీడ్స్‌పై వాళ్ల సంతకాలు లేవని చెబుతున్నారు. పైగా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండానే.. షర్మిల సూచనతో సర్వతి పవర్ డైరెక్టరుగా నియమించిన జనార్ధన రెడ్డి చాగరి పేరు మీదకు 62వేల 126 షేర్లు బదిలీ అయ్యాయి. ఇది కూడా రికార్డుల్లో ఉంది. అంటే.. తనకు తెలియకుండానే యాన్యువల్ జనరల్ మీటింగ్ జరగడం, డాక్యుమెంట్స్ ఏవీ లేకుండానే కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న జనార్ధన్‌రెడ్డి పేరు మీదకు షేర్లు ట్రాన్స్‌ఫర్ అవడం జరిగిపోయాయని గ్రహించిన వైఎస్ జగన్.. షర్మిలకు లేఖ రాశారు. 2024 ఆగస్ట్ 27న ఈ లెటర్ రాశారు. అయితే, వైఎస్ షర్మిల నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో.. 2024 సెప్టెంబర్ 3న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు వైఎస్ జగన్. ఈ పిటిషన్ వేసిన తరువాత.. అంటే 2024 సెప్టెంబర్ 12న.. రియాక్ట్ అవుతూ జగన్‌కు లేఖ రాశారు షర్మిల. ఇదీ జరిగిన కథ.
అయితే.. దీనిపై ఇద్దరి మధ్య లెటర్ వార్ జరిగింది. జగన్ రాసిన లేఖలో ఏముందంటే.. వైఎస్ మరణం కంటే ముందే ఉమ్మడి ఆస్తుల పంపకాలు పూర్తయ్యాయని.. కొత్తగా MOU ద్వారా ఇస్తామన్న ఆస్తులన్నీ తన స్వార్జితమని జగన్ స్పష్టం చేశారు. సరస్వతి పవర్ సహా MOUలో తెలిపిన అన్ని ప్రాపర్టీస్ తన కష్టార్జితమేనని తెలిపారు. అయితే చెల్లిపై ప్రేమ, ఆప్యాయత కారణంగా ఆస్తులు ఇవ్వడానికి సిద్ధపడినట్టు తెలిపారు. నమ్మకం కలిగించడానికి 2019 ఆగస్టు31న MOU కూడా చేసుకున్నాం. ఆస్తుల పంపకానికి అంగీకరించడమే కాకుండా అదనంగా 200 కోట్ల రూపాయలను ఇచ్చినట్టు ప్రస్తావించారు.
సరస్వతి పవర్ మొత్తం షేర్లు ఇవ్వడానికి సిద్దపడ్డా.. 2021లో ఈడీ కేసులు పెట్టి అటాచ్ చేయడంతో వాటిని గిఫ్ట్ డీడ్ చేశామని గుర్తు చేశారు జగన్. కేసులో ఉన్న షేర్లు బదిలీ చేస్తే బెయిల్ రద్దు అయ్యే ప్రమాదం ఉందని తెలిసి కూడా మీరు నిర్ణయం తీసుకోవడం బాధకు గురిచేసింది. దీంతో మనసుకు బాధగా ఉన్నా NCLTకి వెళ్లాల్సి వచ్చిందన్నారు జగన్. ఇంత జరిగిన తర్వాత కూడా ప్రేమాభిమానులు ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. అదే సమయంలో తనపై సోదరిలో అభిమానం కనిపిస్తే ముందు చెప్పినట్టు ఆస్తులు ఇవ్వడానికి ఇప్పటికీ సిద్ధమేనని ప్రకటించారు. MOU రద్దు చేసుకోవాలన్న నిర్ణయం తీసుకోవడం బాధగానే ఉన్నా తప్పని పరిస్థితుల్లో అడుగు వేయాల్సి వచ్చిందన్నారు జగన్. ఆస్తులు ఇవ్వడానికి అంగీకరించే MOU చేసుకున్నా అపనమ్మకంతో నాపై తప్పుడు ప్రచారం చేశారు. ముఖ్యంగా ఇస్తానన్న ఆస్తులు కూడా వారసత్వంగా వచ్చినవి కావు.. కేవలం కేసులున్నాయన్న ఒకే ఒక్క కారణంతో మాత్రమే వెంటనే బదలాయించకుండా MOU చేసుకున్నామని జగన్ గుర్తు చేస్తున్నారు.
జగన్ రాసిన లెటర్‌కు ప్రతిగా లేఖ రాసిన షర్మిల వెర్షన్ మరోలా ఉంది. ఇస్తానన్న ఆస్తులన్నీ ఉమ్మడి ఆస్తులంటున్నారు షర్మిల. తండ్రి వైఎస్‌ఆర్ బతికుండగానే ఉండగానే సాక్షి, భారతి సిమెంట్ సహా అనేక కంపెనీలు ఏర్పాటయ్యాయని వాటిలో నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు వాటాలున్నాయని అంటున్నారు షర్మిల. ఆస్తులు పంపకాలకు సంబంధించి ఇప్పుడు MOU రద్దు చేసుకోవడం చట్టబద్దం కాదంటున్నారు షర్మిల. సరస్వతి పవర్ కంపెనీలో తనకు వాటాలు ఇవ్వకూడదన్న ఉద్దేశం కనిపిస్తుందని షర్మిల వాదన. అగ్రిమెంట్‌లో లేని యలహంక హౌస్‌లోనూ వాటా ఇస్తామని మాటిచ్చినట్టు చెబుతున్నారు చెల్లెలు షర్మిల. తన రాజకీయ జీవితాన్ని శాసించలేరంటున్న షర్మిల.. ఆస్తులు నాలుగు వాటాలు చేయాల్సిందేనని పట్టబడుతున్నారు. మీరు ఆస్తులు పంచకపోతే కోర్టుకు వెళ్లడానికి సిద్దమేనని అన్నకు సంకేతాలు పంపారు షర్మిల. అదే సమయంలో షర్మిల రాసిన లేఖలో తల్లి విజయలక్ష్మి కూడా సంతకం చేయడం విశేషం.
ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది మరొకటి ఉంది. జగన్ తన వాటాను తల్లి విజయమ్మకు గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చారు. అంటే.. బహుమతిగా ఇచ్చారు. అంతేతప్ప.. షేర్లను అధికారికంగా బదిలీ చేసినట్టు కాదు. కోర్టులో కేసులు ఉండడంతో అలా చేయడం చట్ట విరుద్ధం అవుతుంది. కాని, ఈలోగానే వైఎస్ జగన్, భారతి గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చిన షేర్లు విజయమ్మ పేరిట అధికారికంగా ట్రాన్స్‌ఫర్ అయ్యాయనేది ప్రధాన ఆరోపణ. జగన్ తరపు లాయర్లు ఈ విషయం గమనించి.. ఆయన్ను అలర్ట్ చేశారని చెబుతున్నారు. అలా అలర్ట్ చేయడం వల్లే.. వెంటనే వైఎష్ షర్మిలకు జగన్ లేఖ రాశారు. దానికి రిప్లై రాకపోవడం వల్లే NCLTకి వెళ్లాల్సి వచ్చిందనేది జగన్ తరపు వాళ్లు చేస్తున్న వాదన. ఇంతకీ.. జగన్, భారతి సంతకం లేకుండా.. ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్, భారతి దగ్గరే ఉండంగా.. వైఎస్ విజయమ్మ పేరిట షేర్లు ఎలా ట్రాన్స్‌ఫర్ అయ్యాయి? ఈ అనుమానాలను సైతం నివృత్తి చేశారు పేర్ని నాని.
షేర్ సర్టిఫికెట్లు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసి, కొత్త షేర్ల కాపీలు తీసుకుని, వాటిని విజయమ్మ పేరు మీద బదిలీ చేశారని చెప్పారు పేర్ని నాని. వైఎస్ జగన్ పేరుతో ఉండాల్సిన షేర్లు విజయమ్మ పేరిట ట్రాన్స్‌ఫర్ అయితే.. అది పొరపాటుగా జరిగినా సరే.. హైకోర్టు ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుంది. అంటే.. జగన్ బెయిల్ రద్దు అవుతుంది. అందుకే, NCLTకి వెళ్లాల్సి వచ్చింది తప్ప విజయమ్మను కోర్టుకు ఈడ్చే ఉద్దేశం ఏమాత్రం లేదంటున్నారు పేర్ని నాని.
ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా.. వైఎస్ జగన్ తన స్వార్జితం నుంచి తీసి ఇస్తానన్నదే అనేది సర్వత్రా వినిపిస్తున్న వర్షన్. దీనికి కొనసాగింపుగా మరో విషయం చెబుతున్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడే జగన్, షర్మిలకు పంచాల్సిన ఆస్తుల పంపకం పూర్తయిపోయిందనేది మాజీ మంత్రి పేర్ని నాని చెబుతున్నారు. అలా పంచి ఇచ్చిన ఆస్తుల్లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లో 280 గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల పొలం, 15 మెగావాట్ల సండూర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, స్మాల్ హైడ్రో ప్రాజెక్టుల లైసెన్సులు, 22.5 మెగావాట్ల స్వాతి హైడ్రో పవర్ ప్రాజెక్టులో వాటాలు, విజయవాడ రాజ్ – యువరాజ్ థియేటర్‌లో 35 శాతం వాటా, పులివెందులలో మరో 7.6 ఎకరాల భూమి, విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీలో వందకు వంద శాతం వాటాలను షర్మిలకు ఇచ్చారనేది పేర్ని నాని చెబుతున్న లెక్క. ఇవి కాకుండా.. భారతి సిమెంట్స్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, మీడియా వ్యాపార సంస్థలన్నీ జగన్ స్వార్జితం అన్నారు పేర్ని నాని. ఇవి వైఎస్ జగన్ కష్టార్జితం అయినా గానీ.. చెల్లెలిపై ప్రేమతో వాటా ఇస్తానంటూ ఆనాడు ప్రతిపాదన పెట్టారన్నారు. ఆ ఎంవోయూలో భాగంగానే భారతి సిమెంట్స్‌లో 40 శాతం, మీడియా సంస్థలో 40 శాతం, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో 100 శాతం వాటా ఇస్తానంటూ జగన్ ఒప్పందం రాశారన్నారు పేర్ని నాని. కాకపోతే.. కొన్ని ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంతో.. కేసు తేలగానే ఈ ఆస్తులన్నీ ఇస్తానని జగన్ రాశారని పేర్ని తెలిపారు. అంతేకాదు.. తండ్రి ఆస్తిలో సమ భాగంతో పాటు తన కష్టార్జితంతో సంపాదించిన కంపెనీల్లో వాటాలు ఇవ్వడమే కాకుండా.. ఈ పదేళ్లలో షర్మిలకు నేరుగా, కొన్నిసార్లు విజయమ్మ ద్వారా 200 కోట్ల రూపాయలు ఇచ్చానన్నారు వైఎస్ జగన్.
ఒకవిధంగా ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా ఒక వర్షనే. జగన్ చెప్పినా, పేర్ని నాని నోటి నుంచి వచ్చినా.. అదంతా ఓవైపు మాత్రమే. వైఎస్ షర్మిల వర్షన్ కూడా వినాలిగా. ఆ కౌంటరే ఇచ్చారు షర్మిల. ఒక్క సండూర్ పవర్స్ మినహా.. సరస్వతి పవర్స్, భారతి సిమెంట్స్, మీడియా సంస్థ, క్లాసిక్ రియాల్టీ, యలహంక ప్రాపర్టీ.. ఇవన్నీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా స్థాపించిన వ్యాపారాలేనంటారు వైఎస్ షర్మిల. పైగా వైఎస్‌ఆర్ బతికి ఉన్నంత వరకు ఎలాంటి ఆస్తి పంపకాలు జరగనే లేదని చెబుతున్నారు. స్వార్జితం అని వైఎస్ జగన్ ఏ ఆస్తులైతే చూపిస్తున్నారో… అవన్నీ కుటుంబ ఆస్తులే అనేది షర్మిల వాదన. ఇక ఆస్తి పంపకాలు జరిగాయని చెబుతున్న ఆస్తులన్నీ.. తన పేరు మీద పెట్టి వ్యాపారం చేశారు తప్పితే అవేమీ తనకు రాసివ్వలేదంటారు షర్మిల. ఇక గత పదేళ్లలో 200 కోట్లు ఇచ్చామని చెప్తున్నది కూడా తనకు న్యాయంగా రావాల్సిన వాటానే తప్ప.. వైఎస్ జగన్ ప్రేమతో ఇచ్చింది కాదని చెప్పారు. కంపెనీల్లోనీ డివిడెండ్‌లో సగం వాటా తనకు ఇవ్వాల్సిందేనని, అలా ఇచ్చినవే ఆ 200 కోట్లు తప్ప ప్రేమతో ఇచ్చింది కాదు అని చెప్పుకొచ్చారు.
ఆస్తిలో వాటాల పంపకం గురించి మొదట ప్రస్తావించిందే వైఎస్ జగన్ అని ఆరోపించారు షర్మిల. 2019లో సీఎం అయ్యాక.. ఇజ్రాయిల్ పర్యటనలో ఈ ప్రతిపాదన పెట్టారన్నారు. అందులో భాగంగా తన వాటా తనకు ఇచ్చారు తప్ప అదేం జగన్ కష్టార్జితం కాదు అనేది షర్మిల చెబుతున్న మాట. ఇక.. బెయిల్ రద్దు కావాలన్న ఉద్దేశంతోనే షేర్లు బదిలీ చేయించుకున్నారన్న వాదననూ కొట్టిపారేశారు షర్మిల. ఈడీ అటాచ్ చేసింది 32 కోట్ల రూపాయల విలువ జేసే భూములు తప్ప సరస్వతి షేర్స్ కాదన్నారు. సో, షేర్ల బదిలీకి, జగన్ బెయిల్ రద్దుకి ఎటువంటి సంబంధం లేదని కౌంటర్ ఇచ్చారు.
ఇరువైపుల వాదనలు విన్న తరువాత నిపుణులు చెబుతున్నది ఏంటంటే.. విజయమ్మకు గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చిన వాటాను విజయమ్మ పేరిట షేర్లుగా మార్చారు. ఇది నిజం. అది కూడా కంపెనీలో భాగస్వాములుగా ఉన్న వైఎస్ జగన్, భారతి రెడ్డి, క్లాసిక్ రియాల్టీ కంపెనీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చేశారు. ఇదీ నిజమే. పైగా ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్, భారతి దగ్గర ఉన్నప్పటికీ.. అవి పోయాయని కంప్లైంట్ ఇచ్చి.. షేర్లుగా మార్చుకున్నారు అనే వాదన జగన్ వర్గీయుల నుంచి వినిపిస్తోంది. అందుకే, ఈ విషయాలను వైఎస్ షర్మిల తన బహిరంగ లేఖలో రాయలేదంటున్నారు విశ్లేషకులు. ఫైనల్‌గా.. ఘర్ ఘర్ కా కహానీ అంటే ఇలాగే ఉంటుంది. ఇంటింటి రామాయణాలన్నీ ఇలాగే జరుగుతాయి. ‘నా’అన్నవాళ్లతోనే యుద్ధాలు జరుగుతుంటాయి. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు రాజకీయాల్లో ఇలాంటి ఆస్తి తగాదాలు చాలానే జరిగాయి. ఏం.. మీ ఇంట్లో జరగలేదా చంద్రబాబు అంటూ.. పేర్ని నాని బహిరంగంగానే విమర్శించారు. దీంతో జగన్, షర్మిల ఆస్తి తగాదాలకు రాజకీయ రంగు పులుముకుంది. ప్లే బైట్స్ః
మొత్తానికి ఇరువురు ఎవరి వాదనలు వాళ్లు వినిపించారు. స్వార్జితంతో సంపాదించి ప్రేమానురాగాలతో ఇస్తున్నానని జగన్.. కుటుంబ సంపద నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి హక్కు ఉందని షర్మిల ఇలా.. ఎవరి వాదనలు వారు చేసుకున్నారు. దీన్ని ఓ కుటుంబ వ్యవహారంగా చూడాలా లేక అన్నాచెల్లెళ్ల ఆస్తి గొడవగా వ్యవహరించాలా లేక రాజకీయ వివాదంగా పరిగణించాలా అనేది విచక్షణకు వదిలేయాల్సిన మ్యాటర్. ఎవరో అన్నట్టు.. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని కార్ల్‌మార్క్స్ ఎప్పుడో చెప్పాడు. జగన్ ప్రేమానురాగాలతో చేస్తున్న పంపకాలు, షర్మిల ఆస్తి హక్కుల పోరాటం నేపథ్యంలో కార్ల్‌మార్క్స్ సూత్రాలు గుర్తుకొస్తున్నాయి.