గతంలో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు బోరుగడ్డ అనిల్‌ను వెంటాడుతుంది. బుధవారం గుంటూరులో అనిల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం ఐదో అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆయనకు ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది. అనిల్‌ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
గుంటూరుకు చెందిన అనిల్ రిపబ్లికన్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వైసీపీ హయాంలో బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. దీంతో పలు పోలీస్ స్టేషన్‌లలో అనిల్‌పై కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో బోరుగడ్డ అనిల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొంతకాలం హైదరాబాద్, బెంగుళూరు ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల గుంటూరులోని తన ఇంటికి వచ్చారు అనిల్. పట్టాభిపురంలో అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అయితే తన భర్తను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని అనిల్ భార్య ఆరోపించారు. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు.