రాష్ట్రంలో నీట్, ఈఏపీసెట్ కౌన్సెలింగ్ విధానంలో గందరగోళం నెలకొంది. ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తే విద్యార్దులకు ఏ సమస్య ఉండదు. కానీ ఈ రెండు కౌన్సెలింగ్ లు ఒకేసారి రావడంతో ప్రతియేటా వందలాది సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి దాపురించింది. దీంతో విద్యార్దులు, వారి తల్లిదండ్రులు అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు..
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇప్పటికే నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు టీజీ ఈఏపీసెట్ ప్రక్రియ కూడా రేపట్నుంచి (ఆగస్టు 19) ప్రారంభంకానుంది. దీంతో రాష్ట్రంలో కొందరు విద్యార్థులు ఈ రెండింటికీ దరఖాస్తు చేసుకోవడంతో అగ్రికల్చర్ కోర్సులకు సంబంధించి దేనికి ప్రాధాన్యం ఇవ్వాల్లో తెలియక గందరగోళ పడుతున్నారు. తొలుత ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో సీటు దక్కించుకుని, ఆ తర్వాత ఎంబీబీఎస్ లేదంటే బీడీఎస్‌లో ప్రవేశాలు పొందితే.. అగ్రి కోర్సుల ప్రవేశాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఆ సీట్లన్నీ మిగిలిపోయే పరిస్థితి నెలకొంది.
ఇంటర్మీడియట్ బైపీసీ అర్హత కలిగిన చాలామంది విద్యార్థులు అటు నీట్, ఇటు ఈఏపీసెట్ రెండు పరీక్షలకు హాజరవుతున్నారు. సాధారణంగా ఒకదాని తర్వాత మరొకటి కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఒకే సమయంలో రెండు కౌన్సెలింగ్‌లు జరిపితే మాత్రం దేనిలో సీటు వస్తుందో తెలియక తికమకపడాల్సి వస్తుంది. ఈ ఏడాది ‘నీట్’ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయినప్పటినుంచి అగ్రి, హార్టికల్చర్, వెటర్నరీ సీట్ల భర్తీలో ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఆగస్టులో నీట్ కౌన్సెలింగ్ మొదలవగా తొలుత జాతీయ స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది కొంచెం సుదీర్ఘంగా సాగే ప్రక్రియ. అయితే సరిగ్గా ఇదే టైంలో అగ్రికల్చర్ కోర్సుల కౌన్సెలింగ్ కూడా మొదలవడం వివాదానికి దారితీస్తుంది. రెండు ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్ధులకు తొలుత అగ్రి కోర్సుల్లో సీట్లు కేటాయించే పరిస్థితి నెలకొంది.
అగ్రికల్చర్ కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసి తరగతులు ప్రారంభమైన తర్వాత నవంబరు, డిసెంబరులో నీట్ ప్రవేశాలు పొందుతున్నారు. దీంతో అగ్రి సీట్లను వారు రద్దు చేసుకుంటున్నారు. ప్రతిసారి ఇలా జరుగుతుండటంతో గత ఐదేళ్లలో రాష్ట్రంలో దాదాపు 400కి పైగా అగ్రి సీట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అగ్రికల్చర్ కౌన్సెలింగ్ త్వరితగతిన పూర్తిచేసి ఆగస్టు 25 నుంచే తరగతులు ప్రారంభించాలని భావిస్తోంది. మొత్తం 11 వేల మందిలో 2,500 మంది నీట్ ర్యాంకర్లు ఉన్నారు. ఈ రెండింటికీ కౌన్సెలింగ్ ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి నిర్వహించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
































