హెయిర్ కట్ నచ్చలేదని బాలుడి ఆత్మహత్య..

ఇటీవల చిన్నారులు చిన్న విషయాలకు కలత చెందడం, గొడవలకు దిగడం, అంతెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగించుకుంటున్నారు.


ఇంట్లో తమ తల్లిదండ్రుల శోకాన్ని మిగిల్చుతూ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. తాజాగా ఓ బాలుడు హెయిర్ కట్ నచ్చలేదని తనకు ఇష్టమైన కటింగ్ కాకుండా వేరేలా కటింగ్ చేయించారని తండ్రితో గొడవ పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం… గంగారం మండలంలోని చింతగూడెం గ్రామానికి చెందిన ఈసం కాంతరావుకి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడైన హర్షవర్ధన్ (9) సీతానాగారం హాస్టల్ లో ఆరో తరగతి చదువుతున్నాడు.

వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉన్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట హర్షవర్ధన్ తండ్రి కాంతారావు కటింగ్ షాపుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తనకు ఇష్టం లేని కటింగ్ చేపించారని తండ్రితో గొడవకు దిగాడు. సముదాయించిన తండ్రి అతన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఇంటి వెనుక పనులు చేసుకుంటుండగా హర్షవర్ధన్ పురుగుల మందు సేవించాడు. ముందుగా నర్సంపేట లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నయం కాకపోవడంతో అక్కడ నుండి హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం. గంగారం ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించారు.హర్షవర్ధన్ మృతితో చింతగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.