ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటిలో 11వ తరగతి చదువుతున్న కుమారుడు.. అతడి తల్లిని హత్య చేశాడు. హత్య తర్వాత అతను ఆరు రోజుల పాటు మృతదేహంతో ఉన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం తెలిపారు.
మొదట్లో తన తల్లి ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయిందని కొడుకు తండ్రిని, పోలీసులను తప్పుదోవ పట్టించాడని అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలకు వెళ్లేందుకు అతడిని తల్లి ఆర్తి వర్మను నిద్ర లేపడంతో ఆగ్రహానికి గురై ఆమెను నెట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే, కొడుకు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. బదులుగా, అతను పాఠశాలకు బయలుదేరాడు. అనంతరం అధిక రక్తస్రావం కావడంతో ఆమె మృతి చెందింది. బాలుడు పాఠశాల నుండి తిరిగి వచ్చినప్పుడు, అతను తన తల్లి మృతదేహాన్ని చూసి కలత చెందాడు. ఆరు రోజుల పాటు డెడ్‌బాడీ పక్కన పడుకున్నాడు అని అధికారులు తెలిపారు.
చెన్నైలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో అసిస్టెంట్ సైంటిస్ట్ అయిన అతని తండ్రి రామ్ మిలన్ ఆరు రోజులుగా తన భార్యను సంప్రదించలేకపోయిన తర్వాత ఇంటికి తిరిగి రావడంతో మరణం వెలుగులోకి వచ్చింది. తలుపు తెరిచి ఉంది, లోపల నుండి దుర్వాసన వెలువడింది. అతను లోపలికి వెళ్లి చూడగా నేలపై తన భార్య మృతదేహం పడి ఉందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొడుకు తన తండ్రిని, పోలీసులను తప్పుదోవ పట్టించాడు. ఆమె తనంతట తానుగా పడిపోయి చనిపోయిందని ఆరోపించాడు. భయాందోళనతో ఇంటికి బయటి నుంచి తాళం వేసి నాలుగు రోజులుగా దిక్కుతోచని స్థితిలో తిరిగినట్లు పోలీసులు తెలిపారు.
అయితే, శవపరీక్షలో మృతదేహం ఆరు రోజులుగా చనిపోయిందని తేలడంతో, పోలీసులు బాలుడిని తిరిగి విచారించగా, అతను తన నేరాన్ని అంగీకరించాడని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని ఈడ్చుకెళ్లినట్లు సూచించే ఆధారాలు కూడా పోలీసులకు లభించాయని, బయటి వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి రాలేదని సీసీటీవీ ఫుటేజీ నిర్ధారించిందని పోలీసులు తెలిపారు. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.