ప్రస్తుతం సోషల్ మీడియాలో పద్మశ్రీ, హాస్యబ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందంపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఇటీవలే ఆయన ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతి నాడు ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
కాగా, మరోవైపు నుండి ఆయనకు మద్దతు కూడా లభిస్తోంది. ఇంతకీ బ్రహ్మానందం ఏమన్నారు? ఆయనపై దారుణమైన మాటల దాడి చేస్తుంది ఎవరంటే..
పద్మశ్రీ బ్రహ్మానందం.. ఈయన ఎంతో గొప్ప కళాకారుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఆయన గొప్ప భక్తుడు కూడా. సాహిత్యం, పురాణాలపై విశేషమైన పట్టున్న వ్యక్తి. ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వేదాలు, మనుచరిత్ర వంటి ప్రాచీన గ్రంథాల్లో మహిళల అణిచివేతపై కూలంకషంగా వివరించారు. అలాగే గురజాడ అప్పారావు రాసిన ‘కన్యాశుల్కం’, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ వంటి సాహిత్య విమర్శను ప్రస్తావించారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలంటే సావిత్రిబాయి పూలే వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే స్త్రీలను వంటింటికే పరిమితం చేయాలనే భావనలు పురాణాల్లో ఉన్నాయన్నారు. మహిళలు చదువుకుంటే వర్షాలు పడవని ‘మనువు’లో ఉన్న విశేషాలను చెప్పారు.
ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో.. పలువురు ఆయనపై దారుణమైన భాషతో దాడి చేస్తున్నారు. ఆయనకు పురాణాలపై అవగాహనా లేదని దుర్భాషలాడారు. దీంతో ప్రస్తుతం ఈ టాపిక్ మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక సాహిత్యం అంటేనే విమర్శ.. ఈ విషయంలో బ్రహ్మానందంపై అర్థవంతమైన విమర్శలు చేయకుండా దారుణంగా దిగజారి వ్యాఖ్యలు చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఏళ్ల నుండి అన్ని మతాల పురాణాలూ, గ్రంధాలలో మహిళల అణిచివేతపై చర్చ జరుగుతూనే వస్తుంది. కానీ.. అప్పట్లో విమర్శకు, హేతుబద్ధతకు గౌరవంగా స్థానం కల్పించేవారు. మానవులు ఆధునికులు అయినా తర్వాత అనాగరిక భాష మాట్లాడటం ఆందోళన కలిగిస్తోంది.