ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు.
ఏపీ హైకోర్టు ఆదేశాలతో పల్నాడు జిల్లా ఎస్పీని పిన్నెల్లి ఇవాళ కలిశారు. బెయిల్ షరతుల ప్రకారం ఎస్పీ ఆఫీస్‌లో సంతకం చేసి వెళ్లిపోయారు. కాగా, ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో పిన్నెల్లి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు లుక్ ఔట్ నోటీసులు సైతం జారీ చేశారు. పోలీసుల కళ్లు గప్పి తిరుగుతూనే పిన్నెల్లి ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టు ఆశ్రయించారు.
పిన్నెల్లి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు జూన్ 5వ తేదీ వరకు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 5 వరకు ప్రతి రోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేసి వెళ్లాలని హైకోర్టు పిన్నెల్లిని ఆదేశించింది. దీంతో ఇన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి.. కోర్టు ఆర్డర్‌తో ఎట్టకేలకు ఇవాళ ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లిపోయారు. పిన్నెల్లి అజ్ఞాతం వీడి బయటకు రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు నరసరావుపేటలో భారీగా పోలీసులను మోహరించారు