అనుకున్నదే జరిగింది. పుకార్లే నిజమయ్యాయి. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన స్టార్ హీరోయిన సమంత రూత్ ప్రభు రెండో సారి పెళ్లి చేసుకుంది.
కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ రాజ్ నిడిమోరును ఆమె వివాహమాడింది. ఇవాళ (డిసెంబర్ 1) ఉదయం ఈ పెళ్లి జరిగింది. ఈ మేరకు ఓ విశ్వసనీయ వర్గం హిందూస్థాన్ టైమ్స్ కు తెలిపింది.
సమంత రెండో పెళ్లి
గతంలో హీరో అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి, పెళ్లాడింది సమంత. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్లు విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న సమంత.. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో మళ్లీ ప్రేమలో పడింది. అతనితో కొంతకాలంగా డేటింగ్ లో ఉంది. వీళ్లు డిసెంబర్ 1న పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. చివరకు అదే నిజమైంది. సమంత, రాజ్ ఇవాళ వివాహ బంధంతో ఒకటయ్యారు.
తమిళనాడులో
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి సోమవారం ఉదయం తమిళనాడులోని ఇషా యోగా సెంటర్ లోని లింగా భైరవి ఆలయంలో జరిగింది. ఈ మేరకు ఓ సోర్స్ హిందూస్థాన్ టైమ్స్ కు తెలిపింది. “వివాహం ఉదయాన్నే ఇషా యోగా సెంటర్‌లోని లింగా భైరవి ఆలయంలో జరిగింది” అని ఆ విశ్వసనీయ వ్యక్తి తెలిపారు. ఈ వివాహానికి సుమారు 30 మంది అతిథులు హాజరైనట్లు సమాచారం. పెళ్లి కోసం సమంత ఎరుపు రంగు చీర ధరించారని కూడా తెలిసింది.
రాజ్ మాజీ భార్య
ఆదివారం రాత్రి నుండే సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఇంతలో రాజ్ మాజీ భార్య శ్యామలి డే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో “తీవ్ర ఒత్తిడిలో ఉన్నవారు తీవ్రమైన పనులు చేస్తారు” అనే అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. నివేదికల ప్రకారం ఆమె, రాజ్ 2022లో విడాకులు తీసుకున్నారు.
2024 ప్రారంభంలోనే రాజ్, సమంతల రిలేషన్ షిప్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. గత ఏడాదిగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలలో రాజ్ చిత్రాలను పోస్ట్ చేస్తూ వస్తోంది. వీళ్లు బయట వెకేషన్లో కూడా ఎంజాయ్ చేశారు. గతంలో సమంత నటుడు నాగ చైతన్యను వివాహం చేసుకుంది. అయితే వారు వివాహం చేసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత చైతన్య.. నటి శోభితా ధూళిపాళను వివాహం చేసుకున్నారు.

































