ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ టీవీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. లైవ్ టీవీ అప్లికేషన్ పేరుతో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ టీవీ యూజర్లకు ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది.
అయితే పూర్తి స్థాయిలో సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో, BSNL ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (IPTV) సేవను ప్రవేశపెట్టింది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా వీటి ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం బేస్ ప్లాన్ కేవలం రూ. 130గా నిర్ణయించారు.
ఈ లైవ్ టీవీ యాప్.. ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ల్యాండ్‌లైన్ టెలిఫోన్ సేవలు ఒకే CPE ద్వారా పని చేస్తాయి. ఇప్పటికే ఈ సేవలను ఎయిర్‌టెల్, జియోతో పాటు కొన్ని లోకల్ కేబుల్ ఆపరేటింగ్ సంస్థలు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
ఈ సేవల ద్వారా యూజర్లు సెటప్ బాక్స్ లేకుండానే స్మార్ట్ టీవీలో ఛానెల్స్‌ను వీక్షించవచ్చు. ఇంటర్నెట్ ఆధారంగా యాప్స్ అన్నీ పనిచేస్తాయి. వీటితో పాటు కొన్ని ఓటీటీ సేవలు కూడా లభిస్తాయి. ఎయిర్‌టెల్, జియోకు టీవీ రంగంలో కూడా పోటీనిచ్చేందుకు సిద్ధమైంది బీఎస్‌ఎన్‌ఎల్.
ఇదిలా ఉంటే దేశంలో 5జీ సేవలను లాంచ్ చేసే దిశగా బీఎస్ఎన్‌ఎల్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టెలికం డిపార్ట్‌మెంట్ బీఎస్‌ఎనల్ 5జీ సిమ్ కార్డు ఫొటోను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక 4జీ సేవలను పూర్తిగా విస్తరిస్తున్న ఈ సంస్థ చాలా చోట్ల నెట్‌వర్క్ సమస్యలను కూడా వేగంగా సరి చేస్తోంది.