పట్టణాలకే పరిమితమైన BSNL 4జీ సేవలు ఇక నుంచి గ్రామాలకు చేరనున్నాయి. ఇంతకాలం 2జీ, 3జీ సేవలతో నత్తనడకన సాగిన బీఎస్‌ఎన్‌ఎల్ 4జీకి మారడంతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా తయారు చేసిన స్పెక్ట్రం పరికరాలతో మార్కెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. దీంతో ఇప్పుడు అంతా BSNL జపం చేస్తున్నారు.
కొన్నాళ్లుగా ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు ఇష్టారీతిన టారిఫ్‌లు పెంచుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. సగటున 250 రూపాయల నుంచి 300 రూపాయలు రీఛార్జి చేస్తేనే ఆ నెల ఇంటర్నెట్, టాక్‌టైమ్ ఉంటుంది. మూడు నెలల రీఛార్జికి కనీసం 700 నుంచి వెయ్యి రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఇది వినియోగదారుడికి తలకు మించిన భారమవుతోంది. ప్రస్తుతం ప్రధానంగా రెండు ప్రైవేటు కంపెనీల నెట్‌వర్క్ పరిధిలోనే ఎక్కువ కనెక్షన్లున్నాయి. గతేడాది నుంచి వారు టారిఫ్‌లు పెంచుతున్నా ప్రత్యామ్నాయం లేక కొనసాగించాల్సిన పరిస్థితి. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులుంటే మూడు నెలలకు 3 వేల రూపాయల వరకు రీఛార్జీలకే ఖర్చవుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. 150 రోజులకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌కు రూ.397 టారిఫ్ ఉండటంతో వినియోగదారులు పోర్టబులిటీ పెట్టుకుంటున్నారు. గత మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో సిమ్‌ల కోసం పోటీ నెలకొంది. ప్రస్తుతం నెట్‌వర్క్ బలోపేతం పనులు కొనసాగుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో 4జీ టవర్స్ రానున్నాయి. త్వరలోనే BSNL దేశంలో టాప్ టెలికాం కంపెనీగా నిలిచే అవకాశం ఉంది.