జోగి రమేశ్ లాంటి నేతలను పార్టీలో చేర్చుకోకూడదు: టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన కామెంట్స్‌

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నివాసంపై గతంలో దాడి జరిగిన దృశ్యాలను టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రదర్శించారు. బుద్ధా వెంకన్న నివాసానికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. టీడీపీలో క్రమశిక్షణ లోపిస్తోందని, పార్టీలో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్ననేతలు జోగి రమేశ్‌తో పాటు ర్యాలీలో పాల్గొనడం సరికాదని చెప్పారు. జోగి రమేష్ లాంటి నేతలను కూటమి పార్టీలేవీ కూడా చేర్చుకోకూడదని అన్నారు.

అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబం గురించి చెత్త వాగుడు వాగిన వ్యక్తి జోగి రమేశ్ అని బుద్ధా వెంకన్న అన్నారు. నిన్న తమ పార్టీ నేతలు వ్యవహరించిన తీరు చూసి పార్టీని, చంద్రబాబుని అభిమానించే లక్షలాది మంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఆనాడు తాము లేకపోతే జోగి రమేశ్, ఆయన మనుషులు చంద్రబాబు ఇంటి గేటును తాకేవారేనని, ఆ ఘర్షణలో తనకు ఊపిరి ఆడక చనిపోయేవాడినని అన్నారు.

అప్పుడు తన మీదే ఎదురు కేసు పెట్టారని బుద్ధా వెంకన్న తెలిపారు. బియ్యం దొంగ పేర్ని నాని కూడా తనపై రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. వీరు క్షమాపణ చెప్తే సరిపోదని, ఆ కార్యక్రమంలో జోగి రమేశ్‌ని చూడగానే తమ నేతలు వెనక్కు వచ్చేయాల్సిందని తెలిపారు. చంద్రబాబును ఉద్దేశించి విజయసాయిరెడ్డి అనరాని మాటలు అంటున్నా.. ఎవరూ మాట్లాడటం లేదని చెప్పారు. కొందరు తమలపాకుతో కొట్టినట్టు మాట్లాడుతున్నారని తెలిపారు. ఇలాంటి రాజకీయాలను చూస్తానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు.