Budget 2024: బడ్జెట్‌పై వేతన జీవుల ఆశలు.. హెచ్‌ఆర్‌ఏ పరిమితి పెంపునకు డిమాండ్‌!

www.mannamweb.com


Budget 2024: బడ్జెట్‌పై వేతన జీవుల ఆశలు.. హెచ్‌ఆర్‌ఏ పరిమితి పెంపునకు డిమాండ్‌!

Budget 2024: భారత్‌ను ప్రపంచ దేశాలతో పోటీపడేలా ముందుకు నడిపించడమే ఈసారి తన లక్ష్యమని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్‌పై అనేక వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది.

Budget 2024 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 10(13A) ప్రకారం వేతన జీవులు మునుపటి సంవత్సరంలో చెల్లించిన ఇంటి అద్దెపై పన్ను మినహాయింపును (HRA Exemption) కోరే అవకాశం ఉంది. వేతనంలో హెచ్‌ఆర్‌ఏ భాగమై ఉంటేనే దీనికి అర్హులు. ఆదాయపు పన్ను నిబంధనలు 1962లోని రూల్ 2A ప్రకారం హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు మొత్తాన్ని నిర్ణయిస్తారు. ప్రస్తుత హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పరిమితిని చాలాకాలం క్రితం నిర్ణయించారు. మెట్రో, మెట్రోయేతర నగరాల్లో అద్దె చెల్లింపులు విపరీతంగా పెరగడం వల్ల ఈ మినహాయింపును ఈసారి కేంద్ర బడ్జెట్‌లో (Union Budget) క్రమబద్ధీకరించాలని వేతన జీవులు కోరుతున్నారు.

ప్రస్తుతం మెట్రో నగరాలైన చెన్నై, ముంబయి, కోల్‌కతా, దిల్లీలో మూల వేతనంలో 50 శాతంపై హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు (HRA Exemption) కోరవచ్చు. బెంగళూరు, అహ్మదాబాద్‌, పుణె వంటి ఇతర పెద్ద నగరాల్లో ఇది 40 శాతంగా కొనసాగుతోంది. అద్దె భారం భారీగా పెరిగిన నేపథ్యంలో 50 శాతం పరిమితిని అన్ని నగరాలకు వర్తింపజేయాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. మరోవైపు అద్దె చెల్లింపుల నుంచి మూలవేతనంలో 10 శాతాన్ని తీసివేయగా వచ్చిన మొత్తాన్ని మినహాయింపునకు పరిగణిస్తున్నారు. దీన్ని ఐదు శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. తద్వారా మినహాయింపు వర్తించే మొత్తం పెరుగుతుంది. వీటితో పాటు కొత్త పన్ను విధానంలోనూ హెచ్‌ఆర్‌ఏ మినహాయింపును అనుమతించాలని కోరుతున్నారు.

ఇతర డిమాండ్లు..
తాత్కాలిక స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రస్తుత రూ.50,000 నుంచి రూ.1,00,000కు పెంచాలి.
ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు చేయాలి.
కొత్త/డిఫాల్ట్ పన్ను విధానంలోనూ సెక్షన్ 80C, సెక్షన్ 80D, సెక్షన్ 80E, సెక్షన్ 80EEB వంటి వివిధ పన్ను మినహాయింపులను అనుమతించాలి.
వైద్య ఖర్చులు పెరగడం వల్ల సెక్షన్ 80డి కింద కవర్ అయ్యే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల మినహాయింపు పరిమితిని మరో రూ.25,000 పెంచాలి.
సెక్షన్ 80TTA కింద పొదుపు ఖాతాల వడ్డీ ఆదాయంపై లభించే పన్ను రాయితీ పరిమితిని రూ.10,000 నుంచి రూ.50,000కు పెంచాలి. టర్మ్ డిపాజిట్లు/రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయానికి కూడా ఈ సెక్షన్‌ను వర్తింపజేయాలి.
పాత పన్ను విధానంలో హోం లోన్‌పై చెల్లించే వడ్డీలో రూ.2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. రియల్ ఎస్టేట్ ధరలు, గృహ రుణ వ్యయాల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలి. అలాగే కొత్త పన్ను విధానంలోనూ పన్ను చెల్లింపుదారులకు ఈ మినహాయింపును ఇవ్వాలి.
పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 22న ఆర్థిక సర్వేను సభకు సమర్పిస్తారు. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో ఫిబ్రవరి 1న 2024-25కి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. భారత్‌ను ప్రపంచదేశాలతో పోటీపడేలా ముందుకునడిపించడమే ఈసారి తన లక్ష్యమని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కొత్త బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.