ఈ ఏడాది గణపతి ఉత్సవాలు ఆగస్టు 27, 2025 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల సమయంలో గణపతి భూమి మీదకు వస్తాడని భక్తుల నమ్మకం. ఇక వినాయకుడికి వీడ్కోలు పలికే సమయం దగ్గర పడింది.
గణపతి ఉత్సవం సెప్టెంబర్ 6, 2025, శనివారంతో ముగియనున్నాయి. వాస్తవానికి మండపాల్లో కొలువుదీరిన గణపయ్యని అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు. అయితే చాలా మంది 3, 5, 7, 9 రోజుల్లో కూడాబొజ్జ గణపయ్యని గంగమ్మ ఒడిలోకి చేరుస్తారు. మళ్ళీ వచ్చే ఏడాది తిరిగి రమ్మనమని కోరుకుంటారు. వినాయక చవితి వేడుక ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందొ.. అదే విధంగా గణపతి నిమజ్జనం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజలు వేర్వేరు రోజులలో గణపతిని నిమజ్జనం చేస్తారు. కాగా చాలా ప్రాంతాల్లో గణపతి నవ రాత్రి ఉత్సవాల్లో ఐదవ రోజు అయిన ఆగస్టు 31 ఆదివారం గణపతి నిమజ్జనం నిర్వహించారు.
వినాయక చవితి వేడుకలంటే ముంబై తో పాటు హైదరబాద్ కూడా గుర్తుకొస్తుంది. ప్రతి హిందువు ఇంట్లో మాత్రమే కాదు గల్లీ గల్లీ గణపయ్య కొలువుదీరి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. కొంత మంది తమ ఇళ్ళలో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయడం మొదలు పెట్టారు. ఉత్సవాలు ఐదో రోజు ఆగస్టు 31 ఆదివారం ఒక ఫ్యామిలీ తమ ఇంట్లో ప్రతిష్టించిన బుజ్జి గణపయ్యని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్న ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఈ వైరల్ వీడియోలో ఒక ఫ్యామిలీ వినాయకుడి విగ్రహాన్ని RC కారులో కూర్చో బెట్టి.. (రిమోట్ కంట్రోల్ కారు) రిమోట్ తో కంట్రోల్ చేస్తూ నిమజ్జనం చేయడానికి వెళ్తున్నారు. ఇలా గణపతి గంగమ్మ ఒడికి RC కారులో ఒక చిన్న బాలుడిగా వెళ్తున్న సమయంలో ఆ రోడ్డుమీద ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా చూస్తూనే ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది బ్రో అని ఒకరు కామెంట్ చేస్తే.. అరె ఇలాంటి మంచి ఆలోచన మాకు ఎందుకు రాలేదు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.































