సీట్లు త్యాగం చేసిన వారికి బంపర్ ఆఫర్.. ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర.. లిస్టులో ఉన్నది వీరే..

www.mannamweb.com


కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్‌ పదవుల జాతరకు తెరలేచింది. వంద రోజుల పాలన పూర్తిచేసుకున్న వేళ 20 కార్పొరేషన్లతో పాటు మొత్తం 99నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

గత ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వలేనివారికి పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం దక్కింది. అలాగే కూటమి గెలుపు కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన వారికి పదవులు కట్టబెట్టారు. కీలకమైన పోస్టుల భర్తీలో పీటముడి వీడకపోవడంతో ఇన్ని రోజులు వాయిదా వేస్తూ వచ్చారు. పలు దఫాలుగా సమావేశమైన కూటమి నేతలు చర్చించుకొని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ 20 కార్పొరేషన్లలో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1కి ఇచ్చారు.. మొత్తం 99 మందితో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం చోటు కల్పించింది.

20 కార్పొరేషన్లకు చైర్మన్లు, సభ్యుల ప్రకటన

ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌గా మునిరత్నంకి ఛాన్స్ ఇచ్చారు. ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మంతెన రామరాజు, 20సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ నేత లంకా దినకర్, శాప్ ఛైర్మన్‌గా రవినాయుడు, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్‌గా అబ్దుల్ అజీజ్, హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్‌గా బత్తుల తాత్య బాబు, ట్రైకార్ ఛైర్మన్‌గా శ్రీనివాసులు, మారిటైమ్ బోర్డ్ ఛైర్మన్‌గా దామచర్ల సత్య పేర్లు ప్రకటించారు. అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా పీలా గోవింద్, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పిల్లి మాణిక్యరావు, స్టేట్ కన్‌జ్యూమర్ ప్రొటెక్షన్స్ కౌన్సిల్ ఛైర్మన్‌గా పీతల సుజాత, MSMEడెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శివశంకర్ (జనసేన), సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సీతారామ సుధీర్ (జనసేన), ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వజ్జా బాబూరావు, ఏపీ టిడ్కో ఛైర్మన్‌గా అజయ్ కుమార్ (జనసేన), సీడ్ ఏపీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దీపక్ రెడ్డి, మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా కర్రోతు బంగార్రాజు, సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మన్నె సుబ్బారెడ్డి, పద్మశాలి వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నందం అబదయ్య, టూరిజం డెవల్‌మెండ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నూకసాని బాలాజీను ప్రకటించారు.

సీట్లు త్యాగం చేసిన వారికి ఇప్పుడు పదవుల్లో ప్రాధాన్యత..

నెల్లూరు మాజీ మేయర్‌ అబ్దుల్ అజీజ్ ఇప్పుడు వక్ఫ్‌ బోర్డ్‌ ఛైర్మన్ అయ్యారు.. ఎలక్షన్ ముందు నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ ఆశించారు. కానీ కోటంరెడ్డి కారణంగా ఆ సీటు దక్కలేదు. అయినప్పటికీ పార్టీ కోసం పనిచేసిన అజీజ్‌కు వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్ ఇచ్చారు.

ఇక.. డోన్‌లో ముందుగా TDP టికెట్‌ మన్నె సుబ్బారెడ్డికి అనౌన్స్ చేశారు.. కానీ తర్వాత కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డికి టికెట్ మార్చారు. పార్టీ కోసం త్యాగం చేసి పనిచేసిందుకు ఇప్పుడు సుబ్బారెడ్డికి నామినేటెడ్‌ పదవి దక్కింది. ఆయన సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యారు..

ఉండి నియోజకవర్గంలో మొన్నటి సిట్టింగ్ MLA రామరాజు.. రఘురామకృష్ణంరాజు కోసం తన టికెట్ త్యాగం చేసినందుకు ఆయనకు కూడా నామినేటెడ్‌ పదవి దక్కింది.. రామరాజు ఇప్పుడు APIIC ఛైర్మన్ అయ్యారు..

ఇక.. కర్రోతు బంగార్రాజు నెల్లిమర్ల టీడీపీ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా జనసేన నుంచి లోకం మధవి అక్కడ పోటీచేసింది. జనసేన కోసం సీటు త్యాగం చేసిందుకు కర్రోతు బంగార్రాజుకి కూడా ఇప్పుడు పదవి దక్కింది. ఆయన మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్ అయ్యారు

ఇక.. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ అనకాపల్లి టికెట్‌ వదులుకున్నందుకు ఆయన్నూ పార్టీ గుర్తించిందనే చెప్పాలి.. అనకాపల్లి టికెట్ జనసేన నేత కొణతాల రామకృష్ణకు వెళ్లడంతో పీలా గోవింద్‌కు కీలక పదవి ఇస్తామని అప్పుడే పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు అర్బన్ ఫైనాన్స్ అండ్‌ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌గా పీలా గోవింద్‌కు పదవి దక్కింది.

ఇక మచిలీపట్నం MP టికెట్‌ త్యాగం చేసినందుకు కొనకళ్ల నారాయణకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఆర్టీసీ ఛైర్మన్ అయ్యారు.