Guntur: కాలిన కరెన్సీ.. ఇక్కడ చలా‘మనీ’

మనుషులకు, పశువులకు వైద్యం అందించే ఆసుపత్రులున్నట్లుగానే.. చిరిగిపోయిన, కాలిపోయిన కరెన్సీ నోట్లకు కూడా ఆసుపత్రులున్నాయి. అవెక్కడని అనుకుంటున్నారా? గుంటూరులోని జిన్నా టవర్‌ ప్రాంతంలో! 1970లో మొదలై, 50 ఏళ్లుగా ‘నోట్ల ఆసుపత్రి’ పేరుతో ప్రసిద్ది చెందింది ఈ వ్యాపారం. ఇళ్లలో చిరిగిన, కొంతవరకు కాలిపోయిన కరెన్సీ నోట్లను బ్యాంకు వెళ్లి తర్జుమా చేసుకుంటాం. అలానే ఇక్కడి నోట్ల ఆసుపత్రుల్లో మనమిచ్చే కరెన్సీ నోట్లను అవి పాడైన తీరును బట్టి మదింపు వేస్తారు. ఉదాహరణకు చిరిగిన రూ.500 నోటు ఇస్తే.. అది పాడైన తీరును చూసి రూ.200-రూ.350 వరకు విలువ కట్టి మంచి నోట్లు ఇస్తారు.


సేకరించిన చిరిగిన, కాలిన నోట్లను గతంలో ఆర్‌బీఐ శాఖల్లో మార్పిడి చేసి నోట్ల ఆసుపత్రుల నిర్వాహకులు కమీషన్‌ పొందేవారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బ్యాంకుల చెస్ట్‌లో మార్పిడి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ, తెనాలి, రాజమహేంద్రవరం తదితర చోట్ల వీరికి శాఖలు ఉన్నాయి. ఈ సేవలు తమకు ఉపయుక్తంగా ఉన్నాయని ఇక్కడికి వచ్చే సందర్శకులు వివరించారు. రెండేళ్లుగా పోగు చేసిన చిరిగిన నోట్లు రూ.10, రూ.50, రూ.500.. కలిపి మొత్తంగా రూ.970 విలువైన నోట్లు ఇవ్వగా, రూ.750 చెల్లుబాటు అయ్యే నోట్లు తిరిగి ఇచ్చినట్లు పల్నాడు జిల్లా గణపవరం నుంచి వచ్చిన భరత్‌ తెలిపారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.