వయస్సు మీడ పడే కొద్దీ శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. దీంతో పోషకాహార లోపం ఏర్పడుతుంది.
ప్రధానంగా క్యాల్షియాన్ని శరీరం శోషించుకోలేదు. దీని వల్ల ఎముకలు బలహీనంగా మారిపోతాయి. ఫలితంగా ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వస్తుంటాయి. అందువల్ల వయస్సు మీద పడుతున్న వారు ఎముకల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శరీరంలో క్యాల్షియం స్థాయిలను పెంచుకునే ప్రయత్నం చేయాలి. మన శరీరంలో క్యాల్షియం అనేది చాలా ముఖ్యమైన ఖనిజం. ఇది ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది.
పాలు..
శరీరంలో తగినంత క్యాల్షియం లేకపోతే ఎముకలు బలహీనంగా మారి విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎముకలు విరిగిపోతే క్యాల్షియం సరిగ్గా లేకపోతే అవి త్వరగా అతుక్కోవు కూడా. కనుక క్యాల్షియం ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన వారు పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం స్థాయిలను పెంచుకోవచ్చు. పాలలో క్యాల్షియం అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. క్యాల్షియంతోపాటు పాలలో విటమిన్ డి కూడా ఉంటుంది. ఇది శరీరం క్యాల్షియంను శోషించుకునేలా చేస్తుంది. దీంతో ఎముకలు బలంగా ఉంటాయి. ఆవు పాలను ఒక గ్లాస్ తాగితే సుమారుగా 300 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. పాలను ఉదయం లేదా రాత్రి తాగవచ్చు. దీంతో కండరాలు సైతం మరమ్మత్తులకు గురవుతాయి. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
బాదంపాలు..
శరీరానికి క్యాల్షియం సమృద్ధిగా లభించాలంటే బాదంపాలను కూడా తాగవచ్చు. బాదంపాలలోనూ క్యాల్షియం పుష్కలంగానే ఉంటుంది. ఒక కప్పు బాదం పాలను సేవిస్తే సుమారుగా 450 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. దీన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తో తాగితే మంచిది. 100 గ్రాముల సోయా పాలలో సుమారుగా 25 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. సోయా పాలను ఉదయం తీసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. అలసట అనేది ఉండదు. అయితే సోయా పాలు అందరికీ పడవు. అలర్జీలు ఉన్నవారు వీటిని తాగకూడదు. ఇక ఆవు లేదా గేదె పాలు అంటే ఇష్టం లేని వారు బాదంపాలు, సోయా పాలను సేవించవచ్చు. దీంతో క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది.
పెరుగు..
ఒక కప్పు పెరుగును తీసుకోవడం వల్ల సుమారుగా 300 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. పెరుగును రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. దీన్ని మీరు స్మూతీల రూపంలోనూ తీసుకోవచ్చు. పెరుగు ప్రోబయోటిక్ ఆహారం. కనుక జీర్ణ శక్తి సైతం పెరుగుతుంది. పెరుగును రోజూ మధ్యాహ్నం తింటే మంచిది. దీంతో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక మనకు మార్కెట్‌లో ఫోర్టిఫైడ్ రైస్ మిల్క్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా తాగవచ్చు. ఒక కప్పు ఫోర్టిఫైడ్ రైస్ మిల్క్‌లో సుమారుగా 100 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం ఉంటుంది. పాలను తాగలేని వారికి ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
పాలకూర..
పాలకూరలోనూ క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఒక కప్పు పాలకూరను తింటే సుమారుగా 250 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. పాలకూరతో మీరు స్మూతీ తయారు చేసి తాగవచ్చు. ఇందులో అరటి పండు, బాదంపాలు కలిపితే క్యాల్షియం శాతం పెరుగుతుంది. ఈ స్మూతీని సేవించడం వల్ల ఐరన్ కూడా సమృద్ధిగానే లభిస్తుంది. చియా విత్తనాల్లోనూ క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. వీటిని రోజూ తింటే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవచ్చు. చియా విత్తనాలను మధ్యాహ్నం సమయంలో తింటే మంచిది. ఈ విత్తనాలతో స్మూతీలను తయారు చేసి కూడా తాగవచ్చు. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం స్థాయిలను పెంచుకోవచ్చు. అయితే 50 ఏళ్లు దాటిన మహిళలు, 70 ఏళ్లు దాటిన పురుషులు రోజుకు కనీసం 1200 మిల్లీగ్రాముల క్యాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. లేదంటే ఆస్టియోపోరోసిస్ బారిన పడతారు. కాబట్టి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది.