సైబర్ నేరగాళ్లు రోజుకో రకంగా మోసం చేస్తూ జనాలను దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కాల్ మెర్జింగ్ స్కామ్(Call Merging Scam) వెలుగులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది UPI వినియోగదారులు ఈ మోసానికి గురికావచ్చని కేంద్రం ప్రజలకు సూచనలు జారీ చేసింది. మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయడమే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్‌ను అమలు చేస్తారని వెల్లడించింది. దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అయితే దీనిని ఎలా అమలు చేస్తున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాల్ మెర్జింగ్ స్కామ్ అంటే ఏంటి
సాధారణంగా మనం ఆన్‌లైన్ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించేందుకు OTP అవసరం అవుతుంది. కానీ, సైబర్ నేరగాళ్లు ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ ద్వారా వినియోగదారుల నుంచి OTP దొంగిలించి, వారి బ్యాంక్ ఖాతాల నుంచి మనీ లాగేస్తుంటారు.
ఈ స్కామ్ ఎలా పనిచేస్తుంది
నకిలీ ఉద్యోగ ఆఫర్ లేదా ఇతర అవసరాల పేరుతో స్కామర్లు కాల్ చేస్తారు. ఆ క్రమంలో నటిస్తూ బాధితుడి నంబర్‌ను మీ స్నేహితుడి ద్వారా పొందామని చెబుతారు. ఆ తర్వాత బాధితుడికి మరొక ఇన్‌కమింగ్ కాల్ వస్తుందని, దానిని మెర్జింగ్ చేయాలని కోరతారు. నిజానికి, ఆ రెండో కాల్ బాధితుడి బ్యాంక్ నుంచి వచ్చే OTP ఆటోమేటెడ్ కాల్. ఆ సమయంలో కాల్‌ను మెర్జ్ చేయడం ద్వారా, స్కామర్ OTP వివరాలను స్వీకరిస్తాడు. చివరకు ఆ OTPను ఉపయోగించి, స్కామర్ బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును లూటీ చేస్తాడు.
కాల్ మెర్జింగ్ స్కామ్ ఎందుకు ప్రమాదకరం
ఇది సాధారణంగా ఆత్మీయుల ద్వారా వచ్చిన కాల్ అంటూ ఫోన్స్ చేస్తారు. కాబట్టి చాలా మంది దీని పట్ల అవగాహన లేకుండా మోసపోతారు. బాధితుడు ఈ మోసాన్ని గ్రహించేలోపు అతని బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుంది. OTP లేకుండా లావాదేవీలు సాధ్యపడవు. కానీ ఈ స్కామ్ ద్వారా OTPను దొంగిలించడం చాలా సులభంగా మారుతుంది.
కాల్ మెర్జింగ్ స్కామ్‌ల నుంచి ఎలా రక్షించుకోవాలి
1. కాల్ మెర్జింగ్‌కు “నో” చెప్పాలి. ఎవరు అడిగినా తెలియని నంబర్లతో కాల్‌లను మెర్జ్ చేయోద్దు
2. మీ బ్యాంక్, స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా మీకు ఇలాంటి అభ్యర్థన చేయరు
2. ఎవరితోనూ OTPలను పంచుకోవద్దు. బ్యాంక్ అధికారికంగా OTPని ఫోన్ ద్వారా అడగదు
3. స్పామ్ కాల్‌లను గుర్తించండి
4. అనుమానాస్పద కాల్‌లకు దూరంగా ఉండండి
5. బ్యాంకింగ్ యాప్స్ ద్వారా లావాదేవీలు నిర్వహించండి
6. ఏదైనా అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయండి
7. మీరు మోసానికి గురైనట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు