రఘురామ టార్చర్ కేసులో జగన్ కు పిలుపు

www.mannamweb.com


ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజుపై రాజద్రోహం కేసు నమోదు చేసిన తర్వాత సీఐడీ కస్డడీలో హింసించిన వ్యవహారంలో గుంటూరు పోలీసుల విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఎం జగన్ తో పాటు మాజీ సీఐడీ బాస్ పీవీ సునీల్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ సీతారామాంజనేయులుపై రఘురామ ఫిర్యాదు చేశారరు. దీనిపై ఎట్టకేలకు విచారణ ప్రారంభించారు.

అప్పట్లో సీఐడీ కస్టడీలో రఘురామపై పోలీసులు దాడికి దిగారు. దీన్ని ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా నిర్ఘారించింది. అనంతరం ఆయనకు బెయిల్ కూడా లభించింది. కానీ తనపై అప్పట్లో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ రఘురామ గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో అప్పటి సీఎం జగన్ తో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారుల పాత్రపై ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు వీరిని విచారణకు రావాలని నోటీసులు జారీ చేయబోతున్నారు.

ఇప్పటికే రఘురామపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐడీ డీఎస్పీ విజయ్ పాల్ కు సాక్ష్యాధారాలు ఇవ్వాలంటూ పోలీసులు నోటీసులు పంపారు. అప్పట్లో రఘురామను హైదరాబాద్ లో అరెస్టు చేయడం దగ్గరి నుంచి ఆయనపై కస్టడీలో జరిగిన దాడి వరకూ ప్రతీ అంశంలోనూ ఎవరెవరి పాత్ర ఉందో నిర్ధారించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా నిందితుల విచారణ త్వరలో ప్రారంభం కానుంది. మాజీ సీఎం అయిన వైఎస్ జగన్ పై కూటమి ప్రభుత్వంలో నమోదైన తొలి కేసు కూడా ఇదే కావడంతో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.