కర్పూరం కాంఫర్ లారెల్ లేదా సిన్నమొముం క్యాంఫొర అనే చెట్టునుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుడి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు.
కర్పూరం చెట్టు వంద అడుగుల ఎత్తు వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలుతుంటాయి. పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి.
ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి. అయితే ఈ కర్పూరం చాలా రకాలున్నాయి. ఒకొక్కటి ఒక్కోరకంగా మనకి ఉపయోగపడతాయి.
పచ్చకర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాల్లో కూడా వినియోగిస్తారు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు.
హారతి కర్పూరం, రస కర్పూరం, భీమసేని కర్పూరం, ఇంకా, సితాభ్ర కర్పూరం, హిమవాలుక కర్పూరం, ఘనసార కర్పూరం, హిమ కర్పూరం, ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.
కర్పూరంవలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.