సమస్య: నాకు 48 ఏళ్లు. థైరాయిడ్ సమస్య ఉంది. మందులు వాడుతున్నాను. టీ3, టీ4, టీఎస్‌హెచ్ నార్మల్‌గా ఉన్నాయి. ఇప్పుడు నేను మందులు ఆపేయొచ్చా? లేకపోతే కొనసాగించాలా?
సలహా: థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనివారికి టీ3, టీ4 హార్మోన్లు తగినంత విడుదల కావు. అప్పుడు గ్రంథిని ప్రేరేపించటానికి టీఎస్‌హెచ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. టీ3, టీ4 హార్మోన్ల లోపాన్ని భర్తీ చేయటానికే మందులు ఇస్తారు. మీరు మందులు వాడుతుండటం, మందుల మోతాదు సరిపోవటం వల్లనే ఇవి నార్మల్‌గా ఉన్నాయని గుర్తించాలి. అందువల్ల మందులు అలాగే కొనసాగించాలి. ఆపేస్తే తిరిగి ఎక్కువయ్యే ప్రమాదముంది. తరచూ హార్మోన్ల మోతాదుల పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత చేయించుకుంటే చాలు. అయితే మీకు సమస్య ఎంత తీవ్రంగా ఉందో, ఎంత మోతాదులో మందులు వాడుతున్నారో తెలియజేయలేదు. సమస్య మామూలుగా ఉంటే కొందరిలో నయమయ్యే అవకాశమూ ఉంటుంది. ఒకవేళ మీరు తక్కువ మోతాదులో.. అంటే 12.5 మైక్రోగ్రామ్స్, 25 మైక్రోగ్రామ్స్ మోతాదులో మాత్రమే మందులు వేసుకుంటున్నట్టయితే వీటిని ఆపేసి, ఆరు వారాల తర్వాత ఓసారి పరీక్షించుకోండి. ఎందుకంటే థైరాయిడ్ మందులు ఆపేసినా ఆరు వారాల వరకూ టీ3, టీ4 మోతాదులు నార్మల్‌గానే ఉంటాయి. ఆ తర్వాతే పెరుగుతాయి. మీకు ఇవి నార్మల్‌గా ఉన్నట్టయితే మందులు ఆపేయొచ్చు. పెరిగితే మాత్రం జీవితాంతం మందులు కొనసాగించాలి. అయితే థైరాయిడ్ సమస్య అదుపులో ఉన్నట్టు కచ్చితంగా నిర్ధారణ అయిన తర్వాతే, అదీ డాక్టర్ సలహా మేరకే మందులు ఆపాల్సి ఉంటుందని గుర్తించాలి.
































