పన్ను రిటర్నులు దాఖలు చేయడంపై చాలా మందికి అనేక ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యంగా ఫారం 16 లేకపోతే రిటర్న్ దాఖలు చేయవచ్చో లేదో కూడా చాలా మందికి తెలియదు. మీరు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ITR ఫైల్ చేయాలనుకుంటే, ఏమి చేయాలో తెలుసుకోండి. ఎక్కువ సమయం మిగిలి లేదు. జూలై నెలలోపు దాఖలు చేయాలి. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు జూలై 31 చివరి రోజు. మీరు ఇప్పటికీ మీ కార్యాలయం నుండి ఫారమ్-16 అందుకోకపోతే, అలాగే ఐటీఆర్ ఫైల్ చేయడంలో సమస్య ఉంటే, సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసుకోండి.
మీరు ఫారమ్-16 లేకుండానే ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఇది తప్పనిసరి పత్రం కాదు. మీరు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ నుండి ఫారం-26AS, AIS లేదా TIS సర్టిఫికేట్ పొందడం ద్వారా పన్నును దాఖలు చేయవచ్చు. మీరు ఫారమ్-16 లేకుండా మీ ఐటీఆర్ ఫైల్ చేయాలనుకుంటే కొన్ని పత్రాలు అవసరం. జీతం స్లిప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, బ్యాంక్ నుండి టీడీఎస్ సర్టిఫికేట్, ఇంటి అద్దె రుజువు, పెట్టుబడి రుజువు అవసరం. ఫారం-26AS లేదా AIS లేదా TIS అవసరం.
ముందుగా, ఆదాయంపై పన్ను విధించబడుతుందా లేదా అనేది లెక్కించాలి. గణనలను చేతితో సులభంగా చేయవచ్చు లేదా ఆన్‌లైన్ సాధనాలను ఉపయోగించి లెక్కించవచ్చు. టీడీఎస్ వివరాలను పొందడానికి ఆదాయపు పన్ను సైట్ నుండి ఫారం-26AS లేదా AISని డౌన్‌లోడ్ చేసుకోండి. పన్ను విధించదగిన ఆదాయాన్ని లెక్కించిన తర్వాత, మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను సాధారణ ఐటీఆర్ లాగా ఫైల్ చేయవచ్చు.