ప్రతీ మహిళ జీవితంలో గర్భాధారణ చాలా కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో కీలకమైన ఈ దశలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉంటారు. తీసుకునే ఆహారం మొదలు, జీవనశైలిలో మార్పుల వరకు ప్రతీ విషయంలో ఎన్నో నియమాలు పాటిస్తుంటారు.
ఏది తింటే ఏమవుతుందో, ఏది తినకూడదో అని రకరకాల అపోహలు మదిలో మెదులుతుంటాయి.
అలాంటి వాటిలో చేపలు ఒకటి. గర్భిణీలు చేపలు తీసుకోవచ్చా.? లేదా అని చాలా మందిలో సందేహం ఉంటుంది. చేపలు తీసుకోవడం వల్ల పుట్టబొయే బిడ్డ తెలివిగా పుడుతుందని, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయని కొందరు చెబుతారు. అదే సమయంలో చేపలను తీసుకోడం వల్ల ఇబ్బందులు ఉంటాయని కూడా అంటుంటారు. ఇంతకీ గర్భిణీలు తీసుకోవచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..
చేపలను తీసుకోవడం వల్ల గర్భిణీలకు మేలు జరుగుతుందని చెప్పడంలో ఎంత నిజం ఉందో.. ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా సముద్రాల్లో ఉండే చేపలను తీసుకోవడం స్సలు మంచిది కాదు. మెర్క్యురీ అత్యంత విషపూరిత మూలకం. ఇది సాధారణంగా కలుషితమైన నీటిలో ఎక్కువగా కనిపిస్తుంది. మెర్క్యురీని కలుషితమైన సముద్రాలలో ఎక్కువగా పేరుకుంటుంది. ఇలాంటి నీటిలో పెరిగే చేపల్లో మెర్క్యూరీ స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీరంలోకి వెళ్తే.. నాడీ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థను, కిడ్నీలను దెబ్బతీస్తుంది. కడుపులోని బిడ్డ ఎదుగదలకు సమస్యలు ఎదురవుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో తక్కువ మొత్తంలో మెర్క్యరీ శరీరంలోకి చేరినా.. ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. ముఖ్యంగా సొరచేప, మార్లిన్, ట్యూనా, స్వార్డ్ ఫిష్ తీసుకోకూడదు.
ఇక నదుల్లో, చిన్న చిన్న చెరువుల్లో పెరిగే చేపలను తీసుకుంటే పెద్దగా ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే చేపలను సరిగ్గా ఉడకకుండా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. చేపలు పచ్చిగా తింటే.. ఈకోలి, విబ్రియో, సాల్మోనెల్లా, లిస్టెరియా వంటి వైరల్, బాక్టీరియల్, ప్యారాసైజ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది కడుపులో బిడ్డపై కంటే తల్లిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దీంతో డీహైడ్రేషన్, బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.