పదేళ్ల పాత బియ్యం తినొచ్చా? బియ్యం ఎంతకాలం పాడవకుండా ఉంటుంది

థాయిలాండ్ ప్రభుత్వం ఇటీవల 15,000 టన్నుల బియ్యం వేలం వేసింది. అయితే, ఇది తాజా బియ్యం కాదు, పదేళ్ల కిందటిది.


థాయిలాండ్ ప్రభుత్వం గతంలో ఓ ‘వివాదాస్పద’ పథకం ద్వారా ఆ దేశంలోని రైతుల నుంచి మార్కెట్ ధర కంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేసిన ఈ బియ్యాన్ని 10 ఏళ్లుగా నిల్వ చేసింది.

2011లో అప్పటి ప్రధాన మంత్రి యింగ్‌లక్ షినవత్రా ప్రవేశపెట్టిన ఒక పథకంలో భాగంగా రైతుల నుంచి పెద్దమొత్తంలో బియ్యం కొనుగోలు చేశారు.

ఈ పథకాన్ని షినవత్రా రాజకీయ జీవితానికి పునాదిగా చెప్తారు.

ప్రభుత్వం ఆ బియ్యాన్ని కొనడానికి భారీ మొత్తాన్ని చెల్లించింది. ఇందుకోసం 28 బిలియన్ల అమెరికన్ డాలర్లు(సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేసింది.

ఈ డబ్బులో ఎక్కువ భాగం రుణం ద్వారా సమకూర్చుకున్నారు.

కానీ ఈ పథకం విఫలమై ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారింది. అధిక ధరకు కొన్న ఆ బియ్యాన్ని ప్రభుత్వం తిరిగి ఎక్కువ రేటుకు విక్రయించలేకపోయింది. దాంతో పెద్ద మొత్తంలో బియ్యం నిల్వలు ప్రభుత్వం వద్దే పేరుకుపోయాయి.

గత నెలలో థాయిలాండ్‌ వాణిజ్య మంత్రి ఫుమ్‌థామ్‌ వెచయాచై బియ్యం విక్రయాన్ని పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

జూన్ 17న, వీ8 ఇంటర్‌ట్రేడింగ్ కో లిమిటెడ్ అనే ఒక థాయ్ కంపెనీ సుమారు 45 కోట్ల రూపాయలకు వేలంలో ఆ బియ్యాన్ని కొనుక్కుంది.

ఇంతకీ పదేళ్ల కిందటి బియ్యం ఇప్పుడెలా ఉంది? అంతకాలం నిల్వ చేస్తే బియ్యం ఏమవుతుంది?

బియ్యం పథకం తర్వాత ఏమైంది?

బియ్యం ఎగుమతి చేసే టాప్ 3 దేశాలలో ఒకటైన థాయిలాండ్ ఈ బియ్యాన్ని ఎక్కువ ధరకు ఎగుమతి చేయలేకపోయింది.

ఈ పథకం వల్ల 125 వేల కోట్ల రూపాయలకన్నా ఎక్కువ నష్టపోయినట్లు థాయ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

2014లో నెలల తరబడి నిరసనల తర్వాత, సైనిక తిరుగుబాటులో ప్రధాని యింగ్‌లక్ షినవత్రా పదవీచ్యుతులయ్యారు.

ఈ పథకం వల్ల కలిగిన నష్టాలపై 2017లో ఆమెపై విచారణ జరిపారు. దానికి ఆమె హాజరు కాకున్నా, విచారణలో ఆమెను దోషిగా తేల్చారు.

ఆ బియ్యం నాణ్యత ఎలా ఉంది

గత నెలలో, థాయిలాండ్‌ వాణిజ్య మంత్రి ఫుమ్‌థామ్‌ ఆ బియ్యం నాణ్యమైనదేనని, సురక్షితమైనదేనని నిరూపించేందుకు ఆ బియ్యంతో వండిన అన్నం తాను స్వయంగా మీడియా ఎదుట తిన్నారు.

“ఈ బియ్యం గింజలు ఇప్పటికీ బాగానే ఉన్నాయి. అవి కొంచెం పసుపు రంగులోకి మారి ఉండొచ్చు. 10 ఏళ్ల బియ్యం ఇలానే కనిపిస్తుంది” అన్నారు. ఏదైనా బియ్యం బస్తాలోంచి బియ్యాన్ని తీసుకుని, దాని నాణ్యతను తనిఖీ చేయవచ్చని ఆయన మీడియాను సవాల్ చేశారు.

థాయ్ వాణిజ్య మంత్రిత్వ శాఖ, ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించే ల్యాబ్‌లో బియ్యాన్ని పరీక్షించి, దాని ఫలితాలను మీడియాకు విడుదల చేసింది. తమ తనిఖీలో అఫ్లాటాక్సిన్, డియోక్సినివాలెనాల్, బ్రోమైడ్ అయాన్, ఎథిలిన్ ఆక్సైడ్ లేదా ఇతర విషపూరిత రసాయనాలు కనిపించలేదని తెలిపింది.

ల్యాబ్‌లో బియ్యం పోషక విలువలను సైతం తనిఖీ చేసి, ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్న బియ్యానికి వీటికి ఏ మాత్రం తేడా లేదని తెలిపారు.

ఛానల్ 3 అనే ఒక థాయ్ టీవీ ఛానెల్, ఒక స్వతంత్ర ల్యాబ్‌లో మరికొన్ని పరీక్షలు చేసి, ఈ అన్నం తినడానికి సురక్షితం అని నిర్ధరించింది.

ఈ బియ్యంపై బీబీసీ స్వతంత్రంగా ఎలాంటి పరీక్ష చేయలేదు.

బియ్యం పాడవుతాయా?

యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) ప్రకారం బియ్యాన్ని పొడిగా ఉన్న, చల్లని ప్రదేశంలో గాలి చొరబడని కంటైనర్‌లో ఎక్కువ కాలం పాటు నిలువ చేయవచ్చు.

బియ్యం సక్రమ పద్ధతిలో మిల్లింగ్ చేస్తే ఎంత కాలమైనా నిల్వ చేయవచ్చని అమెరికా రైస్ ఫెడరేషన్ చెప్తోంది.

బియ్యం పోషక విలువలను కోల్పోతుందా?

నిల్వ చేసే క్రమంలో దశాబ్దం పాటు పురుగు మందులను ఉపయోగించడం వల్ల బియ్యం విషపూరితమయ్యే ప్రమాదం ఉందా అని బీబీసీ ఎఫ్‌ఏఓను ప్రశ్నించింది.

అయితే అన్ని రకాల మార్గదర్శకాలను పాటిస్తే ప్రమాదాలు ఏవీ ఉండవని ఎఫ్‌ఏఓ సమాధానం ఇచ్చింది.

ఒక దశాబ్దం తర్వాత బియ్యం దాని పోషక విలువలను కోల్పోతుందా అన్న ప్రశ్నకు, బియ్యంలో తక్కువ మొత్తంలో ఉండే విటమిన్లలాంటి కొన్ని సూక్ష్మపోషకాలు తగ్గిపోవచ్చని ఎఫ్‌ఏఓ తెలిపింది.

“అన్నం తినడం వల్ల కలిగే ముఖ్యమైన పోషకాహార ప్రయోజనాల్లో ఒకటి, దానిలోని అధిక పిండి పదార్థం నుంచి వస్తుంది. అది శరీరంలో శక్తిగా రూపాంతరం చెందుతుంది” అని ఎఫ్‌ఏఓ తెలిపింది.

బియ్యం ఎంత కాలం నిల్వ ఉంచినా అందులోని పిండిపదార్థంలో పెద్దగా మార్పులు వస్తాయని తాము భావించడం లేదని, అది ప్రధాన శక్తి వనరుగా ఉపయోగపడుతుందని పేర్కొంది.

అన్నం రుచి మారుతుందా?

సాధారణంగా బియ్యం కాలక్రమేణా రుచిని కోల్పోతుందని ఎఫ్‌ఏఓ తెలిపింది. అయితే ఇది జరగడానికి ఎంత సమయం పడుతుంది అనేది నిల్వ చేసిన పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

థాయ్ టీవీ ప్రెజెంటర్ సొరయుత్ సుతస్సనచిందా 10 ఏళ్ల పాటు నిల్వ చేసిన జాస్మిన్ రైస్‌ను (పొడవుగా, సువాసనతో ఉండే ఒక రకమైన బియ్యం) రుచి చూసి, దాని రుచి తెల్ల బియ్యం లాగే ఉందని.. అయితే, తాను ఊహించినంత సువాసనగా, మృదువుగా లేదని అన్నారు.

థాయ్ ఎన్నికల కమిటీ మాజీ సభ్యుడైన సోమ్‌చై శ్రీసుతియాకోర్న్ కూడా పాత బియ్యాన్ని తినడానికి ప్రయత్నించారు. అయితే ఆయన దాని వాసన బాగా లేదని, బియ్యం ముక్కలుగా మారుతోందని, అన్నం మందంగా లేదని అన్నారు.

థాయ్ రైస్ ఎగుమతిదారుల సంఘం ప్రకారం, గత సంవత్సరం థాయిలాండ్ బియ్యాన్ని ఇండోనేసియా, దక్షిణాఫ్రికా ఎక్కువగా కొన్నాయి.

థాయిలాండ్‌లోని ఒక పెద్ద రైస్ మిల్లు కంపెనీకి చెందిన పైరోట్ వాంగ్డీ, “పాత బియ్యం తినే చాలామంది ప్రజలు పేద దేశాలలో ఉన్నారు” అని తెలిపారు.

దక్షిణాఫ్రికాతో పాటు, థాయిలాండ్ అనేక ఇతర ఆఫ్రికా దేశాలకూ బియ్యం విక్రయించింది.

సాధారణంగా ఆఫ్రికాలో థాయ్ బియ్యానికి మంచి డిమాండ్ ఉందని ఫుమ్‌థామ్ చెప్పారు.

థాయ్ ప్రభుత్వం ఈ విక్రయాన్ని ప్రకటించినప్పటి నుంచి, ఆఫ్రికాకు చెందిన సోషల్ మీడియా యూజర్లు ఆందోళనను వ్యక్తం చేయడం ప్రారంభించారు.

“ప్రపంచం దేన్ని తిరస్కరించినా ఆఫ్రికా దాన్ని స్వీకరిస్తుంది.. ఎప్పటిలాగే ఆఫ్రికా.. మిగతా దేశాలు కుమ్మరించే సరకుల దిబ్బగా మారింది” అని కామెంట్లు చేస్తున్నారు.

కెన్యా ప్రభుత్వం తమ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న బియ్యాన్ని, ల్యాబ్‌లో పరీక్షించిన బియ్యాన్ని మాత్రమే దేశంలోకి అనుమతిస్తామని పేర్కొంది.

థాయ్ బియ్యాన్ని వేలంలో గెలుచుకున్న వీ8 కంపెనీకి ఇంటర్‌ట్రేడింగ్‌కు, ఒప్పందంపై సంతకాలు చేసి, కొనుగోలును పూర్తి చేయడానికి 30 రోజుల గడువును ఇచ్చారు.

అయితే తాము ఈ బియ్యాన్ని ఏయే దేశాలకు విక్రయించాలనుకుంటున్నది వీ8 ఇంకా వెల్లడించలేదు.