సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో అందించిన ఇళ్ల స్థలాల వ్యవహారంపై సర్కారు ఫోకస్ పెట్టింది. అప్పట్లో అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది.
అనర్హులను గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అనర్హులు అని తేలితే వారి ఇళ్ల పట్టాలను ప్రభుత్వం రద్దు చేయనుంది. ఈ మేరకు ఏపీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. 15 రోజుల్లోనే ఈ పని పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే ఇళ్ల పట్టాల రద్దుకి ప్రభుత్వం ఎక్కువ గడువు ఇవ్వకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది.
ఈ తరుణంలోనే ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలూ ఉన్నాయని లబ్ధిదారులు నిరూపించుకోవాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. అందుకు సంబంధించి చూపాల్సిన అర్హత పత్రాలు, ఐడీలు, ధృవీకరణ పత్రాలను కలెక్టర్లకు చూపించాలని అధికారులు చెబుతున్నారు. లేకుంటే ఇళ్ల పట్టాలు రద్దవుతాయని హెచ్చరిస్తున్నారు.
లబ్ధిదారులకు నియమాలు..
అర్హులకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి.
ఇళ్ల పట్టాలు పొందిన వారికి అంతకుముందే ఇల్లు లేదా స్థలం ఉండకూడదు
ఇన్‌కం టాక్స్ చెల్లిస్తూ ఉంటే ఇంటి పట్టా రద్దు చేస్తారు
కారు లాంటి నాలుగు చక్రాల వాహనం ఇళ్ల స్థలం రద్దు చేస్తారు
కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి పట్టాలు ఉన్నా.. ఒకరికి మాత్రమే ఉంచి, మిగతా వారికి రద్దు చేస్తారు.
ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అమ్మితే, వారికీ రద్దు చేస్తారు.
అమ్మిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది.
ఈ ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని ప్రభుత్వం రెడీ చేసింది. దీని ఆధారంగా అధికారులు లబ్ధిదారులను పరిశీలించనున్నారు. లబ్దిదారులు ఇచ్చే వివరాల్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసి.. ఆ తర్వాత పట్టాలు రద్దు చేసి నోటీసులు అందజేయనున్నారు. వైసీపీ పాలనలో కొంతమంది అర్హత లేకపోయినా ఇళ్ల పట్టాలు పొందారని.. కొన్ని ఇళ్లల్లో ఇద్దరు లేదా ముగ్గురికి కూడా ఇళ్ల పట్టాలు ఉన్నాయని ఫైర్ అవుతున్నారు.
అలానే చాలా మంది పట్టాలు పొంది.. ఆ స్థలాల్ని ఇతరులకు అమ్మేశారని కూడా విమర్శలు చేస్తున్నారు. అలానే ఇళ్ల పట్టాలు పొందిన వారిలో చాలా మంది రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదని చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కలకలంగా మారింది.