తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం (జూలై 13న) ప్రముఖ ఫైట్ మాస్టర్ రాజు (Stunt Artist Raju) ప్రమాదంలో మరణించారు. ఆర్య నటిస్తున్న వెట్టువన్ మూవీ షూటింగ్లో భాగంగా రాజు ఓ కారుతో హై రిస్క్ స్టంట్ చేస్తుండగా, అది బోల్తా పడి పల్టీలు కొట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ తమిళనాడులోని కిళైయూర్ కావల్ సరగమ్ సమీపంలో విళుందమావడి గ్రామంలో జరుపుకుంటోంది. గత మూడు రోజులుగా అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ ను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు.
కాంచీపురం నెహ్రూ పూంగండం ప్రాంతానికి చెందిన ఫైట్ మాస్టర్ మోహన్ రాజు వయసు 52 ఏళ్లు. తమిళ సినీ పరిశ్రమలో రాజు అనేక సినిమాలకు స్టంట్ కో-ఆర్డినేటర్‌గా వర్క్ చేశారు. ఆయన ధైర్యంగా రిస్క్ తీసుకునే నైపుణ్యం, డెడికేషన్‌కు ఇండస్ట్రీలో మంచి పేరుంది.
హీరో విశాల్‌తో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ఆయన చేసిన స్టంట్లు ప్రేక్షకుల మెప్పు పొందాయి. రాజు మృతితో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలో హీరో విశాల్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఫైట్ మాస్టర్ రాజు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. అతను చాలా ధైర్యవంతుడు. నా సినిమాల్లో చాలా ప్రమాదకర స్టంట్లు చేశాడు. చాలా ధైర్యంగా, రిస్క్ తీసుకుని పని చేసే రాజుకి ఇలా అవ్వడం బాధాకరం. కేవలం ఒక్క ట్వీట్ చేసి నా పని నేను చేసుకోలేను. అతడి కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటాను. వారికి తోడుగా ఉండటం నా బాధ్యత అని విశాల్ పోస్ట్ చేశాడు.
































