10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు.. ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం: సీఈవో ఎంకే మీనా

అమరావతి: పోలింగ్‌ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించాం. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉంది. దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగించాం’’


‘‘ఈ ఘటనకు సంబంధించి సిట్‌కు పోలీసులు అన్ని వివరాలను అందించారు. 20న రెంటచింతల ఎస్‌ఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. మొదటి నిందితుడిగా పిన్నెల్లిని పేర్కొన్నారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారు. ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉంది. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసు బృందాలు వెళ్లాయి. మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదు. ఈ ఘటన నమోదు అయిన సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీలు జరిగాయి. ఈవీఎం ధ్వంసం ఘటనలో మేమేమీ దాచిపెట్టలేదు. ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించాం’’ అని సీఈవో స్పష్టం చేశారు.

‘‘ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొంది. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్వేఛ్చాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ దీనిని గుర్తించింది’’ అని సీఈవో తెలిపారు.