యూపీఐ ద్వారా సీడీఎంలలో నగదు జమ.. త్వరలోనే అందుబాటులోకి

www.mannamweb.com


భారతదేశంలో బ్యాంకింగ్ రంగ చరిత్రను యూపీఐ సేవలు కీలక మలుపు తిప్పాయి. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలు ఈ స్థాయిలో పెరగడానికి యూపీఐ సేవలే కారణం. మొదట్లో నగదు విత్‌డ్రా కోసం తీసుకొచ్చిన ఏటీఎం సేవలు ఎంతటి విప్లవాన్ని తీసుకొచ్చాయో? ప్రస్తుతం యూపీఐ సేవలు అంతే విప్లవాన్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా నోట్ల రద్దు సమయంలో తీసుకొచ్చిన యూపీఐ సేవలు మొదట్లో కంటే ఇప్పుడు మరింత ప్రజాదరణను పొందాయి. రిజర్వ్ బ్యాంకు ఇండియా కూడా ఎప్పటికప్పుడు యూపీఐ సేవల పరిధిని విస్తరిస్తూ యూపీఐను ప్రోత్సహిస్తుంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ టి.రబీ శంకర్ ఇటీవల నిర్వహించిన గ్లోబల్ ఫినెక్ ఫెస్ట్ 2024లో యూపీఐ ఇంటర్ఆపరబుల్ క్యాష్ డిపాజిట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఫీచర్ ద్వారా త్వరలో కస్టమర్లు డెబిట్ కార్డ్ అవసరం లేకుండా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ యూపీఐ యాప్ ద్వారా క్యాష్ డిపాజిట్ మెషీన్స్‌లో నగదు జమ చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ తీసుకొచ్చిన నయా ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎపీసీఐ) ప్రకారం యూపీఐ ఐసీడీ సదుపాయం కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాలలో లేదా ఏటీఎంలలో ఏదైనా ఇతర బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయడానికి వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా క్యాష్ డిపాజిట్ మెషీన్స్ ద్వారా మనకు ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా యూపీఐ ద్వారా వేరే బ్యాంకు నుంచి నగదు డిపాజిట్ చేయవచ్చు. వినియోగదారులు తమ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేందుకు వర్చువల్ చెల్లింపు చిరునామాలు (వీపీఏ), ఖాతా ఐఎఫ్ఎస్సీలతో పాటు యూపీఐకు లింక్ చేసిన వారి మొబైల్ నంబర్‌ను ఉపయోగించాల్సి ఉంటుది. ఈ ప్రక్రియ ఫిజికల్ డెబిట్ కార్డ్ అవసరాన్ని తొలగిస్తుంది. అలాగే ఏటీఎంలలో నగదు డిపాజిట్లను మరింత సౌకర్యవంతంగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఎన్‌పీసీఐ ఈ కొత్త ఫీచర్‌ను బ్యాంకులు క్రమంగా అందుబాటులోకి తెస్తాయని పేర్కొంది. కాబట్టి వినియోగదారులు రాబోయే నెలల్లో ఏటీఎంలలో యూపీఐ ఇంటర్ఆపరబుల్ క్యాష్ డిపాజిట్ సౌకర్యాన్ని ఉపయోగించడం ప్రారంభించే అవకాశం ఉంటుంది. యూపీఐ కార్డ్ లెస్ క్యాష్ డిపాజిట్ సిస్టమ్ ఇప్పటికే ఉన్న యూపీఐ కార్డ్స్ నగదు ఉపసంహరణ ఫీచర్ లాగానే పని చేస్తుంది. ప్రస్తుతం ఏటీఎం లేదా బ్యాంకు శాఖలలో నగదు డిపాజిట్ చేయడానికి వినియోగదారులు వారి డెబిట్ కార్డులను ఉపయోగించాలి. కొత్త యూపీఐ ఐసీడీ ఫీచర్‌తో నగదు డిపాజిట్ల కోసం ఇకపై డెబిట్ కార్డ్‌ను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. కస్టమర్లు ఇప్పుడు తమ యూపీఐ యాప్స్ ద్వారా మరింత సజావుగా లావాదేవీలను నిర్వహించవచ్చు.