ఉచిత సిలిండర్లకు సంబంధించిన నగదును ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలి.

పేద కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పథకం అమల్లో కొన్ని మార్పులు చేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. ప్రస్తుతం లబ్ధిదారులు పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్‌ బుక్‌ చేసుకున్న తర్వాత.. ఆ మొత్తాన్ని రాయితీగా ప్రభుత్వం వారి ఖాతాలో వేస్తోంది. ఇకపై సిలిండర్‌ బుక్‌ చేసుకున్నారా.. లేదా.. అనేదానితో సంబంధం లేకుండా మూడు సిలిండర్లకు సంబంధించిన నగదును లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం ముందుగానే జమ చేయనుంది. మిత్రపక్షాలైన జనసేన, భాజపాలతో చర్చించాక దీనిని అమల్లోకి తేనున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో మూడు గంటలపాటు జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో మొత్తం 12 అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా జూన్‌ 12న వితంతువులు, ఒంటరి మహిళలకు కొత్తగా లక్షకు పైగా పింఛన్లు అందజేయనున్నారు. సూపర్‌-6, ఎన్నికల హామీల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్‌ను త్వరలో ప్రకటించాలని నిర్ణయించారు. ప్రతి నెలా ఒక సంక్షేమ పథకం అమలు చేసేలా.. 12 నెలలకు క్యాలెండర్‌ ప్రకటిస్తారు. జూన్‌ 12న పాఠశాలలు తెరిచేలోగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. పొలిట్‌బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీమంత్రి, శాసనసభలో ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు విలేకరులకు వివరించారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.