Causes of Baldness : మగవారికి బట్టతల రావడానికి కారణాలు ఇవే.. చికిత్సలు ఏంటంటే..?

ఈ రోజుల్లో జుట్టు రాలిపోయి బట్టతల రావడం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. మరీ ముఖ్యంగా మగవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది.
ఒకప్పుడు 45 లేదా 50 ఏళ్లు దాటిన వారిలో ఈ బట్టతల కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం 25 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో కూడా ఇది కనిపిస్తోంది. దాంతో వారందరూ పెద్ద వయసు వారిలాగా కనిపిస్తున్నారు. బట్టతలను కవర్ చేయడం కోసం అనేక రకాల పాట్లు పడుతుంటారు. కొందరు అయితే డాక్టర్ల వద్దకు క్యూ కడుతుంటారు. ఇలా రకరకాల పనులు చేసి చివరకు విసిగి వేసారిపోతారు. అసలు ఈ బట్టతల రావడానికి కారణం ఏంటి, చికిత్సలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.


అలవాట్లు…
అలవాట్లు అనేవి కూడా బట్టతల వచ్చే విధంగా ప్రభావం చూపిస్తాయి. అందుకే జీవన శైలి అనేది మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. నిద్రలేమి, మద్యపానం, పొగతాగడం లాంటివి చాలా ప్రమాదకరం. వీటివల్లనే బట్టతల వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాదకద్రవ్యాల వాడకం వల్ల కూడా బట్టతల వచ్చే అవకాశముంది.

ఆహారం…

ఆహారం తీసుకోవడం వల్ల మన బాడీకి ఎన్నో పోషకాలు అందుతాయి. సరైన ఆహారం తీసుకోవడం వల్లనే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి మన ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండే విధంగా చూసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు సరిగ్గా లేకపోతే జుట్టు రాలుతుంది. దాని వల్ల బట్టతలకు దారి తీస్తుంది.

హెయిర్ కేర్ ప్రొడక్ట్స్…

హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి కూడా మన జుట్టు రాలడాన్ని ప్రభావితం చేస్తుంటాయి. చాలా మంది జుట్టు స్టైలింగ్ కోసం రకరకాల పరికరాలను వాడుతుంటారు. ఇవి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇవి జుట్టును బలహీన పరుస్తాయి. దాంతో జుట్టు విపరీతంగా రాలిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి.

ఒత్తిడి…

ఈ రోజుల్లో అందరూ రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. నిద్రలేమి, టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు లాంటివి తీవ్రమైన ఒత్తిడికి దారి తీస్తుంటాయి. దాని వల్ల మన జుట్టు విపరీతంగా రాలిపోతుంది. జుట్టు మాత్రమే కాదు మీ చర్మం కూడా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

అంటువ్యాధులు…

చాలామందికి తెలియని విషయం ఏంటంటే అంటువ్యాధులు కూడా జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంటాయి. జుట్టు రాలిపోయేందుకు ఇవి అతిపెద్ద కారణంగా ఉంటాయి. తలలోఉంటే కొన్ని అంటు వ్యాధుల వల్ల కూడా బట్టతల సమస్య వస్తుంది. కాబట్టి చర్మవ్యాధి నిపుణుడిని ముందే సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.

చికిత్సలు…

బట్టతల వచ్చిన తర్వాత అందించే చికిత్సలు చాలానే ఉన్నాయి. ఈ ఆధునిక యుగంలో అవి కాస్త ఎక్కువగానే ఉన్నాయి. పోషకాహార చికిత్స, తక్కువ-స్థాయి లైట్ థెరపీ, మైక్రో-నీడ్లింగ్తో మీసోథెరపీ, ప్లేట్లెట్ అధికంగా ఉండే ప్లాస్మా, జుట్టు పునరుద్ధరణ లేదా జుట్టు మార్పిడి లాంటివి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి డాక్టర్ ను సంప్రదించి వీటిపై అవగాహన పెంచుకోవాలి.