కరుడుగట్టిన నేరాలను సైతం త్వరితగతిన ఛేదిస్తున్న రోజులు ఇవి. అటువంటిది 17 సంవత్సరాలుగా అయోషా మీరా అత్యాచారం, హత్య కేసును తేల్చలేని స్థితిలో పోలీస్ యంత్రాంగం ఉంది.
ఇంతవరకు నిందితులను పట్టుకోలేకపోయింది. శిక్ష వేయలేకపోయింది. అయితే ఉమ్మడి హైకోర్టు ఆదేశాలతో మరోసారి దర్యాప్తు చేపట్టింది సిబిఐ. దాదాపు ఏడేళ్ల పాటు ఈ దర్యాప్తు కొనసాగింది. తాజాగా విజయవాడలోని సిబిఐ కేసులు విచారించే ప్రత్యేక కోర్టుకు దర్యాప్తు నివేదిక సమర్పించింది. 17 ఏళ్ల కిందట జరిగిన ఈ ఘటనపై సిబిఐ ఏం తెలిసింది అన్నది సర్వత్ర ఆసక్తికరంగా మారింది. 2007 డిసెంబర్ 27న ఇబ్రహీంపట్నంలో మహిళల వసతి గృహంలో బీఫార్మసీ చదువుతున్న అయోషా మీరా దారుణ హత్యకు గురైంది. అప్పటినుంచి విచారణ కొనసాగుతుంది కానీ కొలిక్కి మాత్రం రావడం లేదు.
క్షుణ్ణంగా విచారణ
అప్పట్లో అయోషా మీరాను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు దాదాపు 150 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. అయితే 2008 ఆగస్టులో ఈ ఘటనకు బాధ్యుడిగా చేస్తూ సత్యంబాబును అరెస్టు చేశారు. ఈ కేసులో విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. దీనిపై పోలీసులు హైకోర్టులో అప్పీల్ చేశారు. 2017 మార్చి 31న హైకోర్టు కొట్టి వేసింది. పోలీసు దర్యాప్తు సక్రమంగా జరగలేదని అభిప్రాయపడింది. సత్యంబాబును నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. దర్యాప్తు అధికారులపై చర్యలు తీసుకోవాలని తీర్పులో పేర్కొంది.
సిట్ ఏర్పాటు చేసినా
అయితే ఈ కేసు జఠిలం కావడంతో అప్పటి తెలుగుదేశం( Telugu Desam) ప్రభుత్వం ఈ కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది. నాటు విశాఖ రేంజ్ డిఐజి శ్రీకాంత్ ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించారు. కానీ విచారణ సక్రమంగా ముందుకు సాగకపోవడంతో అయోషా తల్లి హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐకి కేసు విచారణ బాధ్యతలు అప్పగించారు. 2018లో సిబిఐ దర్యాప్తు ప్రారంభం అయింది. ఏడేళ్ల దర్యాప్తులో 260 మంది సాక్షులను విచారించింది. అప్పట్లో కేసు దర్యాప్తు చేసిన 50 మంది పోలీసులు, అయోషా ఉన్న హాస్టల్ లో విద్యార్థులు, 25 మంది సిబ్బందిని సిబిఐ ప్రత్యేకంగా పిలిపించి ప్రశ్నించింది. ఈ కేసులో నిందితుడిగా పరిగణిస్తున్న సత్యంబాబు స్వగ్రామం అనాసాగరం వెళ్లి కూడా విచారణ చేపట్టింది. అయోషా మీరా మృతదేహాన్ని బయటకు తీసి రి పోస్టుమార్టం కూడా చేశారు. దిగువ కోర్టులో ఆధారాలను ధ్వంసం చేసిన అభియోగాలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారించారు. ప్రస్తుతం విచారణ పూర్తి కావడంతో సిబిఐ కోర్టుకు నివేదిక ఇచ్చారు. అందులో ఏం పొందుపరిచారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
































