ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. మూడు శాతం డీఏ పెంపు

www.mannamweb.com


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా డీఏను పెంచుతుంది. మూడు శాతం పెంచేందుకు కేంద్ర కెబినెట్ ఆమోదించింది.

పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగుల డీఏను పెంచి దీపావళి కానుకగా ఇస్తున్నాయి. అదే సమయంలో కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు కోసం సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ కానుకను అందించింది. జులై నుంచి అమలయ్యే డియర్‌నెస్ అలవెన్స్ పెంపునకు ఆమోదం తెలిపింది. దిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కెబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఏ 3 శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్‌కు పెరిగిన జీతం, దానితో పాటు వారికి 3 నెలల బకాయిలు కూడా లభిస్తాయి.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం 50 శాతంగా ఉంది. 3 శాతం పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత అది 53 శాతానికి పెరుగుతుంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) ఆధారంగా లెక్కించబడే ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా జీతం లేదా పెన్షన్‌కు జోడించడం ద్వారా డియర్‌నెస్ అలవెన్స్ (DA Hike) ఇస్తారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలల్లో తమ ఉద్యోగుల కరువు భత్యాన్ని రెండుసార్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇవి వరుసగా మార్చి, అక్టోబర్‌లలో ప్రకటిస్తారు. అయితే ఇది జనవరి 1 మరియు జూలై 1 నుండి మాత్రమే వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉద్యోగులు మూడు నెలల బకాయిలతో కూడిన జీతం పొందుతారు. జూలై 2023లో ప్రభుత్వం 18 అక్టోబర్ 2023న కరువు భత్యాన్ని పెంచింది.

ఈ ఏడాది మార్చ్​లో డీఏ 4శాతం పెరిగింది. ఇది జనవరి 2024 నుంచి అమల్లోకి వచ్చింది. మూడు నెలల బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, డీఏ పెంపు అనేది టేక్-హోమ్ పే పెరగడమే కాకుండా మొత్తం ఆర్థిక భద్రతను పెంపొందించే వివిధ ఇతర భత్యాలను కూడా ప్రభావితం చేస్తుంది.

జులై 1, 2024 నుంచి కొత్త రేటు 53 శాతానికి పెరుగుతుంది. దీంతో కోటికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం ఉంటుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు బకాయిలను కూడా అందుకుంటారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

మరోవైపు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు తీపికబురు అందిస్తున్నాయి. దసరాకు ముందు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తన ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపుతో ఆశ్చర్యపరిచింది. 1.80 లక్షల మంది ఉద్యోగులు, 1.70 లక్షల మంది పెన్షనర్లు ఆ రాష్ట్రవ్యాప్తంగా లబ్ధి పొందుతారు.