పాత వాహనదారులకు కేంద్ర హెచ్చరిక..హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేకుండా రోడ్డెక్కితే కేసు

మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైందా? అయితే ఇకపై మీకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (HSRP) తప్పనిసరి! కేంద్ర రవాణాశాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం, ప్రతి వాహన యజమానుడు తన వాహనానికి హెచ్‌ఎస్‌ఆర్‌పీ అమర్చుకోవాల్సిందే.


ఈ నిబంధన అన్ని రకాల వాహనాలకు వర్తించనుంది . సెప్టెంబర్ 30, 2025న గడువు ముగియనుండగా, ఆలోగా కొత్త నంబర్ ప్లేట్‌ను అమర్చకపోతే జరిమానాలు తప్పవు.

ఈ నూతన మార్గదర్శకాలు బుధవారం విడుదలైన గెజిట్ నోటిఫికేషన్‌తో అధికారికంగా అమలులోకి వచ్చాయి. ఈ చర్య ప్రధానంగా రోడ్డు భద్రతను మెరుగుపర్చడం, నకిలీ నంబర్ ప్లేట్లను అరికట్టడం, చోరీల నివారణ వంటి అంశాలపై దృష్టిసారించింది. అంతేగాక, ఇది సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తీసుకున్న కీలక నిర్ణయం తీసుకుంది..

బాధ్యత వాహన యజమానిదే!

పాత వాహన యజమానులు తప్పక ఈ నంబర్ ప్లేట్‌ను అమర్చుకోవాల్సిందే. అది లేకుండా వాహనాన్ని అమ్మడం, కొనడం, ట్రాన్స్‌ఫర్ చేయడం, బీమా చేయించడం, పొల్యూషన్ సర్టిఫికెట్ పొందడం సాధ్యం కాదు. సెప్టెంబర్ 30 తర్వాత హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేని వాహనాలపై కఠినంగా వ్యవహరించనున్నారు. రవాణాశాఖ నిబంధనల ప్రకారం, ఇటువంటి వాహనాలపై కేసులు నమోదు చేయబడతాయి.

వాహన తయారీ కంపెనీలు తమ డీలర్ల వద్ద హెచ్‌ఎస్‌ఆర్‌పీ అమర్చే సౌకర్యాన్ని కల్పించాలి. అలాగే, ఈ సేవకు సంబంధించిన రుసుములు స్పష్టంగా ప్రదర్శించాలి. వాహనదారులు ఇంటికే నంబర్ ప్లేట్ సర్వీసు కోరితే అదనంగా సేవా రుసుము వసూలు చేయవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి?

వాహనదారులు www.siam.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి, తమ వాహన వివరాలు నమోదు చేయాలి. అనంతరం సమీప HSRP ఫిట్మెంట్ సెంటర్‌లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ప్లేట్ అమర్చిన తర్వాత దాని ఫోటోను కూడా అదే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇది తీరా పూర్తయినప్పుడే మీ వాహనం లీగల్‌గా రోడ్డుపై తిరుగుతుంది.

రుసుముల వివరాలు ఇలా..

వాహన రకాన్ని బట్టి హెచ్‌ఎస్‌ఆర్‌పీ ధరలు ఉంటాయి:

ద్విచక్ర వాహనాలు: రూ.320 – 380

ఇంపోర్టెడ్ బైక్స్: రూ. 400 – 500

కార్లు: రూ . 590 – 700

ఇంపోర్టెడ్ కార్లు: రూ.700 – 860

త్రీ వీలర్స్: రూ. 350 – 450

కమర్షియల్ వాహనాలు: రూ. 600 – 800

ఈ ధరల్లోనే మీకు ఆథరైజ్డ్ ప్లేట్ ఫిట్మెంట్ అందుతుంది.

ఆలస్యం చెయ్యొద్దు!

వాహన భద్రత, చట్టపరమైన అనుకూలతలు, అనవసరమైన జరిమానాల నివారణ కోసం మీ వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను సమయానుసారంగా అమర్చుకోండి. ఇది మీ బాధ్యత మాత్రమే కాకుండా భద్రతకీ మార్గం!