Chaganti Koteswara Raoపై దుష్ప్రచారం.. ముగ్గురు సోషల్ మీడియా ప్రతినిధులకు బిగ్ షాక్

బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara Rao)కి అవమానం అంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులకు టీటీడీ(TTD) షాక్ ఇచ్చింది. వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కొద్దిరోజుల క్రితం చాగంటి కోటేశ్వర రావు తిరుమలలో పర్యటించారు. అయితే ఈ పర్యటనపై ముగ్గురు సోషల్ మీడియా ప్రతినిధులు అవాస్తవాన్ని ప్రసారం చేశారు. దీంతో టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు. మంగళవారం తిరుపతి యూనివర్సిటీ(Tirupati University) పోలీసులకు కంప్లైట్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్(Hyderabad) కేంద్రంగా ఉన్న డయల్ న్యూస్(Dial News), పోస్ట్ 360(Post 360), జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిర్వాహకులపై కేసు నమోదు అయింది.


టీటీడీ అధికారులు మాట్లాడుతూ ‘‘చాగంటి కోటేశ్వర రావు తిరుమల పర్యటనపై వాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా టీటీడీ వెల్లడించించింది . డయల్ న్యూస్- హైదరాబాద్, పోస్ట్ 360-హైదరాబాద్, జర్నలిస్ట్ వైఎన్ఆర్ – (YNR) హైదరాబాద్ ప్రతినిధులు పదే పదే టీటీడీ ప్రతిష్టను దెబ్బతినేలా ప్రయత్నం చేశారు. దీంతో సదరు ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం, న్యూఢిల్లీ, విజయవాడలోని పీఐబీకి సైతం ఫిర్యాదు చేశాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాగంటి కోటేశ్వర రావు అభిమానుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీసేలా విష ప్రచారం చేశారు. ఈ మేరకు సదరు సోషల్ మీడియా సంస్థల లైసెన్స్‌లను రద్దు చేయాలని యూట్యూబ్ మేటా మేనేజ్మెంట్‌కి కూడా ఫిర్యాదు చేశాం’’ అని తెలిపారు.

జనవరి 14న శ్రీవారి దర్శనం

‘‘చాగంటి కోటేశ్వరరావుకి జనవరి 14న శ్రీవారి దర్శనం, 16న సాయంత్రం మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు డిసెంబర్ 20, 2024నే ప్రొసిడింగ్స్ ఇచ్చాం. కేబినేట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న ఆయనకు శ్రీవారి దర్శనం ఏర్పాట్లు చేశాం. రాంబగీఛ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి ఆయనను తీసుకెళ్లేందుకు బ్యాటరీ వాహనాలను ఏర్పాట్లు చేశాం. శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు బయోమెట్రిక్‌ను కూడా ఏర్పాటు చేశాం. అయితే టీటీడీ చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లను చాగంటి సున్నితంగా తిరస్కరించారు. సామాన్య భక్తుల తరహాలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయానికి ఆయన చేరుకుంటానని స్వయంగా వెల్లడించి స్వామి వారిని దర్శించుకున్నారు. జనవరి 8న తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో చాగంటి ప్రవచన కార్యక్రమాన్ని వాయిదా వేస్తే బాగుంటుందని ఆయన దృష్టికి టీటీడీ ఉన్నతాధికారులు తీసుకెళ్లారు. ఇందుకు చాగంటి అంగీకరించారు. ప్రవచనాలను మరోసారి మరోసారి వినిపించేందుకు తదుపరి తేదీలను త్వరలో ప్రకటించాలని నిర్ణయించాం. అయితే బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించామని, పరిపాలనా కారణాల రీత్యా చివరి నిమిషంలో చాగంటి ప్రవచనాల కార్యక్రమాన్ని టిటిడి రద్దు చేసినట్లు అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేశారు.’’ అని అధికారులు పేర్కొన్నారు.

చట్టపరమైన చర్యలు తప్పవ్..

శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే కాకుండా, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా అవాస్తవాలు పదే పదే దుష్ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు హెచ్చరించారు.