పొద్దున్నే కడుపులో ఓ కప్పు ఛాయ్ పడితే.. ఆ కిక్కే వేరబ్బా. ఇలా చాలా మంది అనుకుంటారు. ఛాయ్ అందరి జీవితాల్లో అలా ఓ భాగమైపోయింది. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు టీ తాగుతూనే ఉంటారు. కొంతమంది అయితే ఎన్ని కప్పులు తాగుతారో కూడా చెప్పలేం. రోజంతా తాగుతూనే ఉంటారు. అలాంటి చాయ్ ప్రియులకు ఇరాన్ చాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని దశాబ్దాల పాటు హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లో రాజ్యమేలిన ఇరానీ చాయ్.. ఇప్పుడు వెలవెలబోతోంది. అసలు రోజులో ఒక్క ఇరానీ చాయ్ అయినా తాగనిదే పొద్దుగడవని వారున్నా సరే.. ఎందుకు ఈ బిజినెస్ గతంలోలా లాభాలు సంపాదించలేకపోతోంది? టీ నెట్ వర్క్ బిజినెస్ లు దీనికి ఎంతమేర పోటీని ఇస్తున్నాయి? ఇంకా ఏఏ కారణాలు.. ఇరానీ చాయ్ కేప్ ల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయి? ఇరానా చాయ్ Vs టీ చైన్ మార్కెట్ అన్న పరిస్థితి వచ్చేసిందా? మరి చాయ్ వర్సెస్ టీ.. ఇందులో నెగ్గేది ఏది?
కప్పూ సాసర్ లో టీ తాగితే ఆ టేస్టూ.. ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవల్ అంటారు చాయ్ ప్రియులు. కానీ ఇప్పుడు ఆ కప్పూ సాసర్లు మాయమైపోతున్నాయి. నిజానికి మాయమవుతోంది.. కప్పూసాసర్లు మాత్రమే కాదు.. ఇరానీ కేఫ్ లు కూడా. ఇంతకీ అవి ఎక్కువగా మూతపడడానికి కారణలు ఏమిటి? పెరిగిన ముడి సరుకుల ధరలా? లాభాలు తగ్గడమా? రియల్ ఎస్టేట్ బూమా? టీ నెట్ వర్క్ చైన్ లు పెరగడమా? ఇరానీ చాయ్ ఇప్పుడప్పుడిది కాదు. దీనికి వందల ఏళ్ల చరిత్రుంది. పేరుకు ఇరాన్ నుంచి వచ్చినా.. ఇది హైదరాబాద్ కల్చర్ లో ఓ భాగమైపోయింది.
ఎవరైనా ఏదైనా డిస్కస్ చేయాలంటే.. పద ఛాయ్ తాగుతూ మాట్లాడుకుందాం అంటారు. అలా చాలామందికి భాగ్యనగరంలో ఇరానీ చాయ్ తాగడం అలవాటు. కానీ ఇప్పుడు దాని రేట్లు కూడా పెరిగాయి. ఒకేసారి కప్పు మీద 5 రూపాయిలు పెంచారు. దీంతో చాయ్ ప్రియులు షాకయ్యారు. ఓ పాతికేళ్లు వెనక్కు వెళ్లి దీని రేటెంతో చూస్తే.. ఆశ్చర్యపోతారు. 1997లో ఓ కప్పు ఇరానీ చాయ్ ధర కేవలం రెండున్నర రూపాయిలు. 2000 సంవత్సరం వచ్చేసరికీ.. దీని రేటు 5 రూపాయిలకు పెరిగింది. మరో ఐదేళ్లు గడిచాక.. అంటే 2005 నాటికి దీని ధర ఏడున్నర రూపాయిలు అయ్యింది. 2010లోనూ అదే స్థాయిలో పెరిగింది. అప్పుడు కప్పు చాయ్ ధర 10 రూపాయిలుగా ఉంది. ఇక 2014లో దీని రేటు 15 రూపాయిలకు చేరింది. 2020లో దీని ధర 20 రూపాయిలు అయ్యింది. ఇప్పుడు ఇంకో ఐదు రూపాయిలు పెంచారు. దీంతో ప్రస్తుతం కప్పు ఇరానీ చాయ్ ధర 25 రూపాయిలు అయ్యింది. ఇరానీ చాయ్ తాగేవారిలో ఓ అభిప్రాయం ఉంది. దీనిని తాగితే.. యాక్టివ్ గా ఉంటాం.. హెల్దీగా ఉంటాం అని భావిస్తారు. అందుకే ఇప్పుడు రేటు పెరిగినా వదలలేం అంటున్నారు.