Chanakya Niti Telugu : జీవితంలో ఈ ముగ్గురిని అస్సలు సాయం అడగొద్దు..

చాణక్యుడికి రాజకీయాలే కాకుండా సమాజంలోని చాలా విషయాలలో అపారమైన జ్ఞానం, అనుభవం ఉంది. ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, దౌత్యం కాకుండా.., ఆచరణాత్మక జీవితం గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు.
నేటికీ ఆయన మాటలు, సూత్రాలు మనిషికి కష్టకాలంలో ఎంతగానో ఉపకరిస్తాయి. ఎవరైనా చాణక్య నీతిని సరిగ్గా పాటిస్తే.., జీవితంలో ఎప్పుడూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. చాణక్య సూత్రం ప్రకారం, మనిషికి ఇతరులను సరిగ్గా అంచనా వేయగల సామర్థ్యం ఉంటే, వారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. పాము, తేళ్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. కాబట్టి అలాంటి వారిని గుర్తించి వారికి దూరంగా ఉండే సామర్థ్యం మనకు ఉండాలి. అలాగే, జీవితంలో ఎప్పుడూ అలాంటి వ్యక్తుల నుండి సహాయం తీసుకోకండి.


చాణక్య నీతి ప్రకారం, పుట్టుకతో అంధుడైన వ్యక్తి దేనినీ చూడలేడు. కామం, క్రోధం, మత్తు నిండిన వ్యక్తి అది తప్ప మరొకటి చూడలేడు. అదే సమయంలో స్వార్థపరులు ఎవరికీ సహాయం చేయరు. వారందరూ సమానమే. అందుకే స్వార్థపరుడితో స్నేహం చేయకూడదు లేదా సహాయం కోరకూడదు.స్వార్థపరులను పొరపాటున కూడా నమ్మకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మీకు ఎప్పటికీ మేలు చేయలేరు, మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తారు.

చాణక్యుడు ప్రకారం, శత్రువు ముందు నుండి దాడి చేస్తాడు. అతని దాడిని మనం జాగ్రత్తగా ఎదుర్కోవచ్చు. కానీ స్వార్థపరులు, నీచమైన వ్యక్తులు వెనుక నుంచి దాడి చేస్తారు. అలాంటి వారిని ఎప్పుడూ నమ్మవద్దు. స్వార్థపరుడు జీవితంలో తన మంచి గురించి తప్ప మరేమీ ఆలోచించడు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులను ట్రాప్ చేస్తారు.

ఆచార్య చాణక్యుడి ప్రకారం, క్రూర స్వభావం ఉన్న వ్యక్తికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఎందుకంటే కోపం మనిషికి ప్రధాన శత్రువు. కోపంగా ఉన్నప్పుడు ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం బలహీనపడుతుంది. కోపం తెచ్చుకోవడం వల్ల తనకు, ఇతరులకు హాని కలుగుతుంది. కోపంలోని వ్యక్తి మంచి, చెడును తెలుసుకోలేడు. అతను తన ఆనందం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అలాంటి వ్యక్తులు శత్రువుల కంటే ప్రమాదకరం. వారి నుంచి సాయం తీసుకోవద్దు. మీకు సాయం చేసి అందరి ముందు అనేస్తారు.

అత్యాశ, అసూయపడే వ్యక్తికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. కష్ట సమయాల్లో కూడా అలాంటి వారి నుండి సహాయం తీసుకోకూడదు. ఎందుకంటే అత్యాశ, అసూయపడే వ్యక్తులు మీకు మంచికి బదులుగా హాని చేస్తారు. నిజానికి, అసూయపడే వ్యక్తులకు ఏది సరైనది, ఏది తప్పు అనే స్పృహ ఉండదు. వారు ఇతరుల సంతోషం, పురోగతితో ఎప్పుడూ సంతోషించరు. అసూయ, అత్యాశగల వ్యక్తులు ఇతరుల పురోగతిని చూసి అసూయపడతారు. వారికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు. వారి నుంచి సాయం తీసుకుంటే.. మీకే చెడు జరుగుతుంది.