టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు బంపరాఫర్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు, ఈ చిన్న పని చేస్తే చాలు

www.mannamweb.com


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలకు బంపరాఫర్ ఇచ్చారు. ఈ నెల 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు మొదలవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నలుగురు ఓటర్లలో ఒకర్ని సభ్యులుగా చేర్పించాలనే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచనలు చేశారు. ఈ ఏడాది నుంచి కొత్తగా జీవితకాల సభ్యత్వాన్ని ప్రవేశపెడుతున్నామని గుర్తు చేశారు.. దీని కోసం రూ.లక్ష రుసుంగా నిర్ణయించామన్నారు. ఒకవేళ పార్టీ సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే బీమా మొత్తాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచామన్నారు. అంతేకాదు చనిపోయిన కార్యకర్తల అంత్యక్రియలకు రూ. 10 వేలు చొప్పున తక్షణ సాయం అందిస్తామని చెప్పారు.

వాస్తవానికి సాధారణ మరణం పొందిన కార్యకర్తలకూ బీమా వర్తింపజేయాలని కొందరు ఎమ్మెల్యేలు కోరారు.. అలాంటివారిని పార్టీపరంగా ఆదుకుంటామని చెప్పారు. అయితే గతంలో బీమా రాని 73 మందికి రూ.రెండు లక్షల చొప్పున అందించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకు ప్రమాద బీమా కింద రూ. 102 కోట్లు.. సహజ మరణం, ఇతర సమస్యలకు రూ. 18 కోట్లు, విద్యార్థుల చదువు కోసం రూ. 2.35 కోట్లు అందిచామని చెప్పారు. టీడీపీ కేడర్‌కు ఆర్థిక భరోసా కల్పించేందుకు.. వారికి నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలు, ఇతరత్రా ఆదాయ మార్గాలు చూపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో ఈ పని చూడాలని.. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి త్వరలో నిర్ణయం తీసుకొంటామని హామీ ఇచ్చారు.

మరోవైపు నామినేటెడ్‌ పదవుల్లో.. రాష్ట్రం యూనిట్‌గా చేసుకుని టీడీపీకి 80 శాతం, మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు 20 శాతం చొప్పున కేటాయిస్తామన్నారు చంద్రబాబు. మొత్తం 23,500 మంది నేపథ్యంతో పాటుగా పార్టీకి వారు చేసిన సేవల్ని పరిశీలించి.. పూర్తిగా అన్ని అంశాలపై చర్చించిన తర్వాత జాబితాలు సిద్ధం చేశామని చెప్పారు.. త్వరలోనే అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఈ పోస్టులు ఇచ్చిన వారి పేర్లు ఓ 4 గంటల ముందు చెబుతానన్నారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీతో సమన్వయంలో సమస్యలు తలెత్తుతున్నాయని కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబు దగ్గర ప్రస్తావించగా.. ఒకవేళ ఎక్కడైనా సమస్య ఉంటే. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నేతలతో ఏర్పాటు చేసిన కమిటీ పరిష్కరిస్తుందని చెప్పారు. జనసేన పార్టీతో సమన్వయంతో పనిచేయాలని.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్తులోనూ ఆ పార్టీతో కలసి ప్రయాణించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల పనితీరుపై ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహిస్తానని చెప్పారు చంద్రబాబు. తాను వివిధ మార్గాల్లో సమాచారం రప్పించుకుంటానని చంద్రబాబు తెలిపారు.. దీనిపై ఐదుగురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఒకవేళ కమిటీ నుంచి ఎవరికైనా పిలుపు వస్తే.. వారి దగ్గర ఏదో తప్పు జరుగుతోందని గ్రహించాలి అన్నారు. వీరిని కమిటీ ముందు పిలిచి మాట్లాడుతుందని.. అప్పటికీ అవసరమైతే తానే స్వయంగా మాట్లాడతాను అన్నారు. రెండోసారి తప్పు చేస్తే ఇక మాట్లాడటం ఉండదని.. చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. తాను క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటానని.. మళ్లీ
1995 నాటి చంద్రబాబుని చూస్తారన్నారు. ఒకవేళ చర్యలు తీసుకున్నాక తనను ఎవరూ తప్పుగా అనుకోవద్దన్నారు.

మరోవైపు ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదుల పరిష్కారం, పర్యవేక్షణ కోసం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని పరిష్కరించే విధానం తీసుకొద్దామని చెప్పారు.. అలాగే మంత్రులు జిల్లాలకు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులకు కచ్చితంగా సమాచారం ఇవ్వాలని సూచించారు. కూటమిలో మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఫోకస్ పెట్టాలన్నారు. గత ప్రభుత్వంలో తప్పు చేసినవారిని చట్ట ప్రకారం శిక్షించే పని ఇప్పటికే మొదలైందన్నారు చంద్రబాబు.