ఏపీలో మహిళా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ఇవాళ ఓ శుభవార్త చెప్పారు. గతంలో ఇచ్చిన ఓ హామీని అమలు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఈసారి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తెచ్చిన ఓ విధానం ప్రకారం మహిళా ఉద్యోగులకు ఓ వెసులుబాటు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఆయా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ పొందేందుకు పిల్లల గరిష్ట వయోపరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఉద్యోగ విరమణ వరకూ ఎప్పుడైనా ఈ చైల్డ్ కేర్ లీవ్ వినియోగించుకునేలా ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. మహిళా ఉద్యోగులతో పాటు ఒంటరి పురుష ఉద్యోగులకూ దీనిని వర్తింప చేస్తూ ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. దివ్యాంగులైన పిల్లల సంరక్షణ సహా వివిధ సందర్భాల్లో చైల్డ్ కేర్ లీవ్ ను పొందేందుకు వీలుగా ఉత్తర్వులు ఇచ్చారు.
అలాగే తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.మొత్తం 180 రోజుల పాటు చైల్డ్ కేర్ లీవ్ ను ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకునేలా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సెలవుల్ని వినియోగించుకునే విషయంలో పరిమితి ఉండటంతో మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడేవారు. కానీ ప్రభుత్వం తాజాగా ఉద్యోగ సంఘాలతో చర్చల్లో ఈ పరిమితి ఎత్తేస్తామని హామీ ఇచ్చింది. దాని మేరకు ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి.


































