విద్యార్థులకు శుభవార్త వినిపించిన చంద్రబాబు ప్రభుత్వం

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర మానవ వనరుసల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు.


తాజాగా నిర్వహించిన సమావేశంలో గత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇకనుంచి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన వసతి దీవెన, విద్యా దీవెన పథకాల కింద కొన్ని కళాశాల్లో డబ్బు జమవలేదు.

సర్టిఫికెట్ల విషయంలో ఇబ్బందులు

అలా జమవకపోవడంవల్ల సర్టిఫికెట్ల విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు ఉన్నప్పటికీ వారికి వెంటనే సర్టిఫికెట్లు అందించాలంటూ నారా లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వైసీపీ ప్రభుత్వం రూ.3480 కోట్ల బకాయిలు పెట్టడంతోపాటు ఫీజు రీయింబర్స్ మెంట్ విధానం తొలగించిందని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారని మంత్రి వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలవల్ల ఆరు లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లోనే ఉండిపోయాయన్నారు.

సమూల ప్రక్షాళన

విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వం పాఠశాలల్లో, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను, అధ్యాపకులను సినిమా థియేటర్ల దగ్గర కాపలాగా ఉంచిన విషయం తెలిసిందే. సినిమా థియేటర్లలో ప్రభుత్వం నిర్దేశించిన టికెట్ ధరలకే అమ్మకాలు సాగుతున్నాయా? లేదా? అనే విషయం పరిశీలింపచేయడానికి వీరిని ఉపయోగించారు. దీనిపై టీచర్లు వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇదొక్కటే కాకుండా కొన్ని సర్వేలకు, మరికొన్ని ఇతర పనులకు పాఠాలు బోధించే గురువులను ఉపయోగించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అటువంటివాటినన్నింటినీ చక్కదిద్ది గురువులను కేవలం పాఠాల భోదనకే పరిమితం చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది.