ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. తుపాన్ నేపథ్యంలో అవన్నీ ఫ్రీ

మొంథా తుపాను ఏపీని అతలాకుతలం చేస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరద ముప్పు పొంచి ఉన్న గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.


ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికీ, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన విధంగా అధికార యంత్రాంగం నిత్యావసరాలను సమకూర్చింది. 25 కేజీల బియ్యం, (మత్స్యకారులకు, చేనేత కార్మికులకు 50 కేజీలు), కేజీ కందిపప్పు, పామాయిల్ ఒక లీటర్, ఉల్లిపాయలు కేజీ, బంగాళాదుంపలు కేజీ, పంచదార కేజీ చొప్పున అందిస్తారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలను అనుసరించి ఆ శాఖ అధికార యంత్రాంగం అన్ని రేషన్ షాపులకు వీటిని చేర్చింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 14,415 రేషన్ షాపుల్లో 1 లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3424 మెట్రిక్ టన్నుల పంచదారతోపాటు ఇతర నిత్యావసరాలు పంపిణీకి సిద్ధంగా ఉంచారు.

నిత్యావసరాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యనారాయణ సహాయ చర్యలను, ఆహారం, నిత్యావసరాల పంపిణీని సమన్వయం చేస్తారని ఏపీ డిప్యూటీ సీఎంఓ కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది. కాగా ఏపీలో తుఫాన్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఏరియల్ వ్యూ ద్వారా వరద నష్టాన్ని అంచనా వేయనున్నారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని చంద్రబాబు ఆదేశించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.