ఏపీలో వర్షాకాలం నేపథ్యంలో రోడ్ల పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. పలు చోట్ల వర్షాలకు భారీగా గుంతలు పడి రోడ్లపై ప్రయాణాలు చేయలేని పరిస్ధితులు ఉంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ రోడ్లు, భవనాల శాఖపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతల రహితంగా తీర్చిద్దిదాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే రోడ్ల అభివృద్ధి-మరమ్మత్తుల పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని మంత్రి, స్పెషల్ సీఎస్ ల్ని ఆదేశించారు.
కూటమి ప్రభుత్వంలో రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో రాబోయే డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో రహదారులన్నింటిని గుంతల రహితంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.ఇప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే రహదారులు మరమ్మతు పనుల నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడవద్దని, అత్యుత్తమంగా ఉండేలా చూడాలన్నారు. రహదారుల అభివృద్ధిలో అత్యున్నత సాంకేతిక విధానాలను, వినూత్న మెటీరియల్ ను ఉపయోగించే విధానాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
ఈ ఏడాది రహదారుల నిర్వహణ, అభివృద్ధి కోసం రూ.2500 కోట్లతో పనులు చేపట్టేందుకు ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇచ్చామని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా రూ.400 కోట్లు నాబార్డ్ నిధులతో 1250 కి.మీ జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధి కోసం 191 పనులు మంజూరు చేశామన్నారు. ఈ పనులన్నీ ఇప్పటికే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించినట్లు తెలిపారు. ఇవి కాకుండా రూ.600 కోట్లు మూలధన వ్యయం కింద 227 పనులు మంజూరు చేశామన్నారు. వీటితో పాటు 1450 కిలోమీటర్ల మేర రహదారులు అభివృద్ధి చేయడానికి కాంట్రాక్టులు ఇచ్చామన్నారు.
మరో 2,104 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి కోసం 274 పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. ఇందుకోసం రూ.1000 కోట్లతో ఆయా పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. డిసెంబర్ నెల మొదటి వారంలో ఈ పనులన్నింటినీ గుత్తేదారులు గుర్తించి పనులు మొదలు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వర్షాకాలం, వరుస తుఫానులు కారణంగా ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్న క్రమంలో ఈ పనులు ప్రారంభం కాలేదని, వచ్చేవారంలో ఈ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు.



































