దర్శన క్యూ వ్యవస్థలో మార్పులు – కొత్త టికెట్ కౌంటర్లు

 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దర్శనానికి 24 గంటల సమయ పడుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండటం తో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు.


భక్తుల రద్దీ కి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. దర్శనం లో సాంకేతికత వినియోగించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టింది. అలిపిరి వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు పై కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో క్యూ లైన్ల నిర్వహణలో మార్పులు తెచ్చింది. తాజాగా టికెట్ కౌంటర్ల నిర్వహణలోనూ నిర్ణయాలు తీసుకుంది.

కొనసాగుతున్న రద్దీ

తిరుమలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. వారాంతంలో 90 వేలకు పైగా, మిగిలిన రోజుల్లో 70,000 నుంచి 80,000 మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగు ణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో సరైన లెక్కింపు లేకుండానే కంపార్ట్‌మెంట్‌కు ఇంతమంది అని ఉజ్జాయింపుగా లెక్కించేవారు. ఇప్పుడు టీటీడీ తిరుమలలో భక్తుల క్యూ లైన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌పై దృష్టి సారించింది. దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరినీ లెక్కేసి, క్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసుకొని భక్తులకు సులభంగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుం టున్నారు. క్యూలైన్‌లో భక్తులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఖాళీ ఉందనే వివరాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

కీలక చర్యలు

అందులో భాగంగా రద్దీ ప్రాంతం నుంచి ఖాళీ ఉన్నచోటుకు భక్తులను పంపి తోపులాట చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. కంపార్ట్‌మెంట్లలోకి నిర్ణీత సంఖ్యలో మాత్రమే భక్తుల ను అనుమతిస్తున్నారు. అదే విధంగా ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండి ఏటీసీ, టీబీసీ, ఏటీజీహెచ్, కృష్ణతేజ అతిథిగృహం, రింగురోడ్డు మీదుగా శిలాతోరణం వరకు వేచి ఉండే భక్తులకు ఎప్పటి కప్పుడు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ఇందుకోసం క్యూలైన్‌కు ఆనుకొని 15 చోట్ల కొత్తగా ఫుడ్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు అన్నప్రసాదాలు పంపుతూ ఎప్పుడు, ఎంత సరఫరా చేశారో ఆ వివరాలు నమోదు చేస్తున్నారు.

కొత్త కౌంటర్

టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా శ్రీవాణి టికెట్ల జారీకి కొత్త కౌంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్థానిక హెచ్‌వీసీ సమీపంలోని అన్నమయ్య భవన్ ఎదురుగా సువిశాలంగా నిర్మించిన నూతన భవనంలో శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ లో భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేలా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూలైన్లు సిద్దం చేశారు. వికలాంగులు, వృద్ధులు విశ్రాంతి తీసుకునేందుకు మెత్తటి సోఫాలు ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ అదనపు ఈవో కార్యాలయం నిర్వహించారు. రద్దీ ఎక్కువ కావడం, వీఐపీ సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులతో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కార్యాలయం మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.