మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే. వై నాట్ 175 అంటూ నినాదం ముందుకెళ్లిన ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి.
కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితికి వచ్చేసింది.
ఫలితాల తర్వాత జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ సమీక్షలు కూడా చేశారు. ఈ ఐదేళ్ల పోరాడాల్సిన అవసరం ఉందని… మళ్లీ అధికారంలోకి మనమే వస్తామంటూ పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం కూడా చేశారు. వైసీపీకి ప్రతిపక్షం కొత్త కాదంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం పార్టీ బలోపేతంపై జగన్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
పార్టీని బలోపేతం చేసే దిశగా పలు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ముందుగా అనుబంధ విభాగాలపై దృష్టిపెట్టారు. ఇప్పటివరకు ఉన్న అధ్యక్షులను మారుస్తూ… కొత్త వారిని నియమిస్తున్నారు. తాజాగా 15 విభాగాలకు కొత్త అధ్యక్షలను నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ అధినేత జగన్ ఆదేశాలను జారీ చేశారు.
వైయస్ఆర్ సీపీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిని నియమించారు. రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డికి అవకాశం కల్పించారు. రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్‌రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
15 విభాగాలకు కొత్త అధ్యక్షులు :
-వైయస్ఆర్ సీపీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
-రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డి
-రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
-రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఖాదర్‌బాషా
-రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డి
-రాష్ట్ర మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్
-రాష్ట్ర వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జునయాదవ్
-రాష్ట్ర వైయస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతంరెడ్డి
-రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్‌రెడ్డి
-రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష
-రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోచం రెడ్డి సునీల్
-రాష్ట్ర వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్‌రాజు
-రాష్ట్ర గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడిగా నారాయణమూర్తి
-రాష్ట్ర వైయస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఇద్దరు ఎమ్మెల్సీలు.. రామచంద్రారెడ్డి (ప్రైవేట్ స్కూళ్లు)ని చంద్రశేఖర్‌రెడ్డి (గవర్నమెంట్ స్కూళ్లు)
-రాష్ట్ర అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమించారు.
టెక్కలి బాధ్యతల నుంచి దువ్వాడ ఔట్:
టెక్కలి వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కూడా అధినాయకత్వం దృష్టి పెట్టింది. టెక్కలి వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ పదవి నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ను తొలగిస్తూ.. ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్‌ను నియమించారు.
గత కొద్ది రోజులుగా దువ్వాడ భార్య వాణి.. దివ్వెల మాధురి మధ్య వివాదం నడుస్తోంది. కుటుంబ వివాదంతో దువ్వాడ ఫ్యామిలీ రోడ్డెక్కింది. ఈ గొడవల కారణంగా పార్టీకి చెడ్డపేరు వస్తుందనే కారణంతో దువ్వాడపై వేటు వేసినట్టు తెలుస్తోంది. అటు ప్రత్యర్థి పార్టీలు కూడా వైసీపీపై విమర్శలు చేశాయి. ఈ క్రమంలోనే… దువ్వాడను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తూ పేరాడ తిలక్ ను అప్పగించారు.
మరోవైపు పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి ఇటీవలే ఆళ్ల నాని రాజీనామా చేశారు. దీంతో ఏలూరు జిల్లా అధ్యక్ష పదవిని కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు అప్పగించారు. ఇక పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి(రాయచోటి), మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డి(పులివెందుల), మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి(చంద్రగిరి)ని నియమించారు.