రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కస్టమర్లకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది. చెక్కుల క్లియరెన్స్ సమయాన్ని రెండు రోజుల నుంచి కేవలం 4 గంటలకు తగ్గిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది.
చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS)ను బ్యాచ్ ప్రాసెసింగ్ నుంచి ఆల్వేస్ క్లియరింగ్, ‘ఆన్-రియలైజేషన్-సెటిల్‌మెంట్’ విధానానికి మార్చనుంది. ఈ కొత్త విధానం రెండు దశల్లో అమలు కానున్నట్టు పేర్కొంది.
మొదటి దశ(ఆక్టోబర్ 4, 2025 – జనవరి 2, 2026)లో ఉదయం 10:00 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఒకే ప్రెజెంటేషన్ సెషన్ ఉంటుంది.బ్యాంక్ బ్రాంచ్‌లకు వచ్చిన చెక్కులను వెంటనే స్కాన్ చేసి క్లియరింగ్ హౌస్‌కు పంపాలి. డ్రా కావాల్సిన చెక్కులను బ్యాంకులు సాయంత్రం 7:00 గంటలలోపు ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. లేకపోతే అవి ఆమోదించబడినట్లు భావించి సెటిల్‌మెంట్‌కు చేర్చబడతాయి.
రెండవ దశ(జనవరి 3, 2026)లో చెక్కుల గడువు సమయం T+3 గంటలకు మారుతుంది. అనగా ఉదయం 10:00 నుంచి 11:00 గంటల మధ్య వచ్చిన చెక్కులను మధ్యాహ్నం 2:00 గంటలలోపు ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. సెటిల్‌మెంట్ పూర్తయిన తర్వాత, క్లియరింగ్ హౌస్ ఆమోదం/తిరస్కరణ సమాచారాన్ని ప్రెజెంటింగ్ బ్యాంక్‌కు పంపుతుంది. ప్రెజెంటింగ్ బ్యాంక్ ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేసి, ఒక గంటలోపు కస్టమర్‌కు విడుదల చేయాలి.
చెక్కుల క్లియరెన్స్ సామర్థ్యాన్ని మరింత పెంచడం, సెటిల్‌మెంట్ రిస్క్‌ను తగ్గించడమే లక్ష్యంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుల గురించి బ్యాంకులు తమ కస్టమర్లకు అవగాహన కల్పించాలని RBI ఆదేశించింది.
































