విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమరావతి-ఆవకాయ్’ ఈరోజు (గురువారం) ప్రారంభమైంది. జనవరి 8 నుంచి 10 వరకు జరిగే ఈ ఉత్సవంలో సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే ముఖ్య ఉద్దేశ్యం.
అమరావతి-ఆవకాయ్ ఉత్సవాల్లో యూరోపియన్ యూనియన్ ఎక్స్ లెన్సీ అంబాసిడర్ హాగ్ టెలిఫిన్ తోపాటు మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమా, వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఐఏఎస్ అజయ్ జైన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హాగ్ టెలిఫిన్ మాట్లాడుతూ.. ‘అమరావతి-ఆవకాయ్ ఉత్సవాల ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. కళాకారుల నృత్యాలు, కృష్ణమ్మకు హారతి ఇవ్వడం మంచి అనుభూతి కలిగించాయి. భారతదేశం, యూరప్ దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల కొన్ని కీలకమైన అంశాలలో ఇరుదేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ప్రధానితో మా దేశ అధ్యక్షులు అనేక అంశాలలో సహకరించుకునేందుకు సంతకాలు చేసుకున్నారు. యూరోపియన్, ఇండియా మధ్య మంచి స్నేహ సంబంధాలు ఎంతో గొప్పగా సాగుతున్నాయి. ఇండియన్ సినిమాలు అనగానే ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ ఎంతో పాపులర్ అయ్యాయి. ఇప్పటికీ మా దేశ ప్రజలు ఆ సాంగ్‌కి స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తారు. కూచిపూడి నృత్యానికి ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అమరావతి- ఆవకాయ ద్వారా అనేక అంశాలను ఒక చోట ప్రదర్శించడం అద్భుతం’ అని అన్నారు.
ఈ ఉత్సవంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ.. ‘విజయవాడలోని ఆహ్లాదకరమైన ప్రకృతి, గలగలా పారే కృష్ణమ్మ తీరాన ‘అమరావతి-ఆవకాయ్’ ఉత్సవాలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఘనంగా ప్రారంభించారు. ఈ మూడు రోజులు నృత్యాలు, సాహిత్యం వంటి అంశాలపై అనేక ప్రదర్శనలు నిర్వహిస్తాం. రాష్ట్రం నుంచే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి వచ్చే అవకాశం ఉంది. క్రియేటివ్ ఎకానమీ పెంచుకోవాలంటే టూరిజం అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారు. సీఎం ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. పిఠాపురంలో సంక్రాంతి ఉత్సవాల వల్ల ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాలేకపోయారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను ఆనందంగా తిలకించి ఆస్వాదించాలని కోరుతున్నాను’ అని అన్నారు.
































