గత కొన్ని రోజులుగా చిరంజీవి నెక్స్ట్ సినిమా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా నేడు ఆ సినిమాను అధికారికంగా ప్రకటించారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో నాని సమర్పణలో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు.
దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ.. అతను తన ప్రశాంతతను వైలెన్స్ లో వెతుక్కుంటాడు అని కొటేషన్ రాసారు. ఇక ఆ పోస్టర్ లో రక్తం కారుతున్న చిరంజీవి చెయ్యి ఉంది. అలాగే ఇది చిరంజీవి కెరీర్లోనే మోస్ట్ వైలెంట్ ఫిలిం అని అనౌన్స్ చేసారు. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా పై అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా గురించి ప్రకటిస్తూ నాని.. నేను ఆయన్ని చూస్తూ పెరిగాను. అయన సినిమా టికెట్స్ కోసం లైన్లో నిల్చున్నాను. ఆయన కోసం నా సైకిల్ పోగొట్టుకున్నాను. ఆయన్ని సెలబ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయన్ని ప్రజెంట్ చేస్తున్నాను. ఇది అంతా ఒక సర్కిల్ లాంటిది. మనందరం ఎదురుచూస్తున్న మెగాస్టార్ మ్యాడ్ నెస్ రాబోతుంది. దీని గురించి కలగన్న శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అంటూ పోస్ట్ చేసారు.
ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నానితో ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అయ్యాక మెగాస్టార్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. దసరా డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా, మోస్ట్ వైలెంట్ ఫిలిం, నాని ప్రజెంట్ చేయడం.. వీటన్నిటితో ఈ సినిమాపై ఇప్పట్నుంచే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాని నాని యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రజెంట్ చేస్తుండగా సుధాకర్ చెరుకూరు SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి శ్రీకాంత్ ఓదెల పోస్ట్ చేస్తూ.. ఫ్యాన్ బాయ్ తాండవం ఎలా ఉంటుందో చూపిస్తాను ప్రామిస్ అంటూ పోస్ట్ చేసాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు.