విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘చావా’ సినిమా గత ఐదు రోజులుగా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తోందో తెలిసిందే. ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
విడుదలకు ముందే అంచనాలు పెంచిన ఈ చిత్రం.. రిలీజ్ తర్వాత ఆ అంచనాలను మించిపోయింది. తొలి రోజు నుంచి భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు తీవ్ర భావోద్వేగానికి గురవుతూ కన్నీళ్లు పెట్టుకోవడం, నినాదాలు చేయడం లాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం ఇండియాలోనే ఈ సినిమా రూ.200 కోట్ల మైలురాయి దిశగా దూసుకెళ్తోంది.
ఐదు రోజుల్లో ఇండియా వసూళ్లు రూ.180 కోట్ల మార్కుకు చేరువగా ఉన్నాయి. మంగళవారం, వీక్ డేలో ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించడం విశేషం. సోమవారం కన్నా మంగళవారం వసూళ్లు పెరిగాయి. ‘చావా’కు లాంగ్ రన్ ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఎక్కడిదాకా వెళ్లి ఆగుతుందో అంచనా వేయడం కష్టంగా ఉంది. ఐతే సామాన్య జనానికి ఎక్కువగా తెలియని శంబాజీ కథను తీస్తేనే జనం ఇంతగా ఊగిపోతున్నారు.
మరి దేశవ్యాప్తంగా, భాష-ప్రాంత భేధం లేకుండా అందరూ ఒక యోధుడిలా చూసే శివాజీ కథను పకడ్బందీగా తీస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన ఇప్పుడు అందరిలోనూ మొదలవుతోంది. ప్రస్తుతం శివాజీ మీద వేర్వేరుగా సినిమాలు అనౌన్స్ అయ్యాయి. అన్నింట్లోకి ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టిని శివాజీగా చూపించబోతున్న సందీప్ సింగ్ సినిమా మీద అమితాసక్తి నెలకొంది. ఈ రోజే దాని ప్రి లుక్ రిలీజ్ చేశారు. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘చావా’ లాగే పకడ్బందీ, భావోద్వేగ భరితంగా శివాజీ కథను తెరకెక్కిస్తే బాక్సాఫీస్ దగ్గర దానికి హద్దులే ఉండవు. పాన్ ఇండియా స్థాయిలో అది సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.