సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో అసలేం జరుగుతోంది..?

www.mannamweb.com


పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ హింసతో దద్దరిల్లిపోతోంది. ఇటీవల ఆందోళనకారులు ఓ పోలీస్‌పై మూకదాడి చేసి హత్య చేశారు. అవామీ యాక్షన్‌ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

సోమవారం పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో జరిగిన ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం జరిగిన అల్లర్లలో ఒక పోలీసు అధికారి సహా మరికొందరు పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో వ్యాపారాలు పూర్తిగా మూతపడ్డాయి. శనివారం ఆందోళనకారులను అదుపు చేయడానికి భద్రతా దళాలు ఒక దశలో ఏకే-47తో కాల్పులు జరపాల్సి వచ్చింది. తక్షణమే ఇక్కడి పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం 2,300 కోట్ల పాకిస్థానీ రూపాయిలను విడుదల చేసినా.. పరిస్థితి అదుపులోకి రావడంలేదు.

స్థానిక మంగ్లా డ్యామ్‌ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును తమకు ఉచితంగా ఇవ్వాలని స్థానికులు బలంగా డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాదు.. గోధుమలపై రాయితీలు కల్పించాలని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ద్రవ్యోల్బణం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో స్థానిక ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేశారు. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం 144 సెక్షన్‌ విధించింది.

ఇటీవల పీవోకేలో ఉద్యమకారుడు అంజాద్‌ అయుబ్‌ మిర్జా మాట్లాడుతూ నిరాయుధులైన ప్రజలపై బలగాలు కాల్పులు జరుపుతున్నాయని ఆరోపించారు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారన్నారు. పొరుగు దేశం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ”ఇక్కడ పరిస్థితి చేజారిపోయింది. భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం కల్పించాలి” అని డిమాండ్‌ చేశారు.

మంగ్లా డ్యామ్‌లో పాక్‌ దోపిడీ..

1967లో జీలం నదిపై మంగ్లా ఆనకట్టను నిర్మించారు. ఇక్కడ భారీ హైడ్రోపవర్‌ ప్లాంట్‌ ఉంది. 1975 నాటికే డ్యామ్‌ నిర్మాణ ఖర్చులు వచ్చేశాయి. ఒక్క 2010లోనే ఇక్కడ 250 బిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. దీని ఆదాయం మొత్తం పాకిస్థాన్‌ ప్రభుత్వం తీసుకుంటుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని స్థానిక ప్రభుత్వానికి నయాపైసా కూడా ఇవ్వదు. మీర్పుర్‌ జిల్లాలోని అత్యంత సారవంతమైన భూములను తీసుకొని ఈ ఆనకట్ట నిర్మించారు. ఈ భూముల్లో వాస్తవానికి స్థానికులు ఆహార ధాన్యాలను పండించుకొనేవారు. డ్యామ్‌లో మొత్తం 1400 మెగావాట్ల విద్యుత్తు తయారవుతుండగా.. వీటిల్లో 300 మెగావాట్లను స్థానికంగా ఇస్తామని నాడు పాక్‌ ఇక్కడి ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. కానీ, ఇక్కడి నుంచి పాక్‌ పంజాబ్‌లోకి విద్యుత్తు తరలించడం మొదలు పెట్టింది. వాస్తవానికి అక్కడి పంజాబ్‌ వాసులతో పోలిస్తే స్థానిక ప్రజలు ప్రతి యూనిట్‌పై అధిక ధర చెల్లించడం ప్రజల్లో అసంతృప్తిని రేపింది.

పీవోకేలో ఏటా 20 లక్షల వృక్షాలను నరికేసి పాకిస్థాన్‌ తరలించి విక్రయిస్తారని పరిశోధకుడు డాక్టర్‌ షబ్బీర్‌చౌధ్రీ వెల్లడించారు. ఫలితంగా స్థానికంగా మట్టిపెళ్లలు విరిగిపడటం, వరదలు రావడం వంటివి పెరిగాయి. ఈ ప్రాంతంలో ఏటా 300 కోట్ల పాకిస్థానీ రూపాయలకు సరిపడా పువ్వులు, వన మూలికలను పండిస్తారు. వీటిని పాక్‌ కార్పొరేషన్లు విక్రయించుకొని సొమ్ము చేసుకొంటున్నాయి. స్థానిక ప్రభుత్వానికి ఇచ్చే నిధులపై ఎటువంటి రికార్డులు లేవు. ఇక నీలం లోయలో అమూల్యమైన రత్నాలు దొరుకుతాయి. ఇక్కడి నుంచి పాకిస్థాన్‌ దాదాపు 40 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన రత్నాలను వెలికి తీసి విక్రయించుకొంది. ఈ ప్రాంతాన్ని ఈ స్థాయిలో దోచుకొన్న ఇస్లామాబాద్‌ స్థానికంగా మంచినీటి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయలేదు. మురికినీరు తాగి ఇక్కడ ఏటా వేలమంది ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ ఆగడాలతో విసిగిపోయినా స్థానికులు తరచూ పాక్‌ పాలకులపై తిరుగుబాట్లు చేస్తున్నారు.

భారత ఎఫెక్ట్‌..

పుల్వామా దాడి తర్వాత పాక్‌ నుంచి వచ్చే ఎండు ఫలాలు, రాతి ఉప్పు, సిమెంట్‌, జిప్సమ్‌ వంటి వాటిపై కస్టమ్స్‌ డ్యూటీని న్యూదిల్లీ 200శాతం పెంచింది. ఫలితంగా పాక్‌ నుంచి దిగుమతులు పడిపోయాయి. 2019 తర్వాత కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుతో పాక్‌ పూర్తిగా వాణిజ్యాన్నే నిలిపివేసింది. ఆ ఆర్థిక ఒత్తిడి ఇస్లామాబాద్‌ మీదుగా పీవోకే పై పరోక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతోంది.