సివిల్ సర్వీసెస్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

www.mannamweb.com


యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీస్‌ పరీక్షల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యేటా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు పోటీ పడుతుంటారు.

అయితే అదృష్టం మాత్రం కొందరినే వరిస్తుంది. అయినా పట్టువిడవక కొందరు చివరి అవకాశం వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. లక్షల్లో వచ్చిన తరఖాస్తులను యూపీఎస్సీ అధికారులు ప్రిలిమినరీ పరీక్షలో ఫిల్టర్‌ చేసి, మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ దశకు వచ్చేటప్పటికీ ఆ సంఖ్య వందలకు పరిమితం అవుతుంది. దీనిని బట్టి చూస్తే.. ఈ పరీక్షలకు హెవీ కాంపిటీషన్‌ ఉంటుందన్న సంగతి మీకు అవగతమై ఉంటుంది. నిరుద్యోగులు యేళ్లకు యేళ్లు శిక్షణ తీసుకుంటూ ప్రిపరేషన్‌ సాగిస్తుంటారు.

అయితే క్లిష్టమైన యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని బీసీ సంక్షేమ శాఖ ముందుకొచ్చింది. సివిల్స్‌ ప్రాథమిక, తుది పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు అర్హత కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ సంచాలకుడు ఎ మల్లికార్జున తెలిపారు.

అర్హత కలిగిన అభ్యర్థులు నవంబరు 24వ తేదీ లోపు బీసీ సంక్షేమ సాధికార కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులందరికీ నవంబరు 27న స్క్రీనింగ్‌ పరీక్ష ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన 100 మందిని ఎంపిక చేసి, బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. అభ్యర్థులను బీసీ కేటగిరీలో 66 శాతం, ఎస్సీ కేటగిరీలో 20 శాతం, ఎస్టీ కేటగిరీలో 14 శాతం రిజర్వేషన్‌ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. ఉచిత శిక్షణకు ఎంపికైనవారికి ఉచిత బస, భోజన వసతి కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.